న్యూఢిల్లీ: భారత్‌తో దౌత్య వివాదం వల్ల తలెత్తిన పరిణామాలపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఆందోళన వ్యక్తంచేశారు. పర్యాటకంపరంగా ఇండియా ఇచ్చిన బాయ్కాట్కాల్పై ఆయన స్పందించారు. భారత్ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ‘దౌత్య వివాదం, బాయ్‌కాట్ పిలుపు మాల్దీవులపై చాలా ప్రభావం చూపింది. జరిగినదానికి మాల్దీవుల ప్రజల తరఫున క్షమాపణలు కోరుతున్నా.
ఈ సెలవుల్లో ఎప్పటిలాగే భారత ప్రజలు మాల్దీవులకు రండి. మా ఆతిథ్యంలో ఎలాంటి మార్పు ఉండదు’ అని నషీద్ విన్నవించారు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత దళాలను దేశం విడిచి వెళ్లిపోవాలని కోరినప్పుడు ఇండియా సంయమనంతో వ్యవహరించిందని నషీద్ కొనియాడారు. కాగా, దౌత్య వివాదంతో మాల్దీవులకు భారత పర్యాటకుల సంఖ్య నిరుడితో పోలిస్తే 33 శాతం తగ్గినట్లు అంచనా.
