దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా ఢిల్లీ ప్రభుత్వం ఖైదీల పట్ల ఉదారంగా వ్యవహరిస్తోంది. కొన్ని నెలల జైలు శిక్షను తగ్గించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా కూడా తీహార్ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. ఇవాళ(శుక్రవారం) అన్ని లాంఛనాలు పూర్తైన తర్వాత ఆయన తీహార్ సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు.
ఓం ప్రకాశ్ చౌతాలా..టీచర్ల రిక్రూట్ మెంట్ స్కాంలో దోషిగా తేలడంతో కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. ఇప్పటివరకు తొమ్మిదిన్నరేళ్ల జైలు శిక్ష పూర్తయ్యింది. మరో ఆర్నెల్ల శిక్ష మాత్రమే మిగిలుండగా.. ఢిల్లీ ప్రభుత్వం కరోనా వ్యాప్తి కారణంగా అందుకు మినహాయింపునిచ్చింది. దాంతో చౌతాలా ముందుగానే విడుదలయ్యారు.
