Kapil Dev: ఏపీ సీఎం చంద్రబాబుతో కపిల్‌దేవ్ భేటీ

దిగ్గజ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్(ACA) అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)తో కలిసి ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన కపిల్ దేవ్.. అక్కడ చంద్రబాబుతో  భేటీ అయ్యారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. 

ఏపీలో ఇప్పటికే గోల్ఫ్ కోర్టు ఉండగా.. అది విశాఖపట్నంలోని ముడసర్లోవ ప్రాంతంలో ఉంది. అలాంటిదే ఏపీ రాజధాని అమరావతిలోనూ నిర్మించాలని కపిల్‌దేవ్‌ ఆలోచిస్తున్నారట. ఈ విషయమై చర్చించేందుకు భారత మాజీ క్రికెటర్.. ఏపీ ముఖ్యమంత్రితో భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే, భూమి ఎక్కడ ఎకేటాయిస్తారనేది ప్రభుత్వ నిర్ణయమని కపిల్‌దేవ్‌ వెల్లడించారు. స్పోర్ట్స్‌ సిటీ ఇస్తే చాలని అన్నారు. 

ఇండియన్‌ గోల్ఫ్‌కు అధ్యక్షుడిగా ఉన్న కపిల్‌దేవ్‌ను ఏపీ అంబాసిడర్‌గా ఉండాలని కోరినట్లు కేశినేని చిన్ని తెలిపారు. త్వరలో అనంతపురం, అమరావతి, విశాఖలో గోల్ఫ్ కోర్స్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.