ఎందుకంత ఆగమవుతున్నరు!

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె, వారి ఆత్మహత్యలు, ఆంగన్ వాడీల పోరాటం, ఇలా ఎన్నో నిరసన పోరాటాలను మాజీ సీఎం చోద్యం చూశారు. తన మాట చెల్లింపు కోసం ఆయన, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ది కూడ అదే ధోరణి. బీఆర్ఎస్  పది ఏండ్ల పాలనలో ఇలాంటి అనుభవాలు ఎన్నో ..! ప్రజలను నేరుగా అప్పటి సీఎం కేసీఆర్ కలిసింది లేదు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి  ప్రభుత్వం ఎంతోకాలం ఉండదని బీఆర్ఎస్​ నేతలు చెబుతూ వచ్చారు. 

ఇప్పుడు తనని అరెస్ట్ చేస్తారని, జైల్లో పెడతారని, తనకు తానే చెప్పుకుంటూ కేటీఆర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఆగమాగం అవుతున్నారు. నోరు జారుతూ ఉన్నారు. ఆయనలో  ఫ్రస్ట్రేషన్  కనిపిస్తున్నది.  బీఆర్​ఎస్​ తీరే, కాంగ్రెస్​కు కలిసొచ్చిందిబీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నపుడు అసెంబ్లీ లో, బయట బీఆర్​ఎస్​ పాలకుల​ అహం, విపక్షం పట్ల, విపక్ష ఎమ్మెల్యేల పట్ల,  ప్రజా సంఘాల పట్ల వ్యవహరించిన తీరును తెలంగాణ ఎలా మర్చిపోగలదు!  సీపీఐతో ఒక సీట్ షేరింగ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్  కోదండరాం తదితరుల మద్దతు, మాజీ ఎంపీ, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు కాంగ్రెస్​లో చేరిన ప్రభావం, తెలంగాణలో కాంగ్రెస్​కు  కలిసి వచ్చింది. 

ప్రతిపక్ష రాజకీయం

ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నిరసనలు తెలుపుతున్నారు. సహజంగా బీఆర్ఎస్ విపక్షంలో ఉంది కాబట్టి జనం వెంట వారు ఉంటారు. బీజేపీ సైతం ఉంటుంది. రాష్ట్రంలోనూ ఇండ్ల కూల్చివేతను సైతం వీరు పలు చోట్ల వ్యతిరేకించారు. ఫార్మా విలేజీలకు రైతులు భూములు ఇవ్వబోం అంటున్నారు. ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు ప్రజలను  తప్పుదోవపట్టించే పనిలో ఉన్నాయా అని అనిపిస్తున్నది. రాజకీయ అరెస్టులు తప్పవా?ఇటీవల లగచర్ల గ్రామంలో కలెక్టర్ మీద జరగిన కేసులో  బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ను అరెస్ట్ చేశారు. 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ను కూడా అరెస్ట్ చేస్తారు అంటున్నారు. ప్రస్తుతం కేటీఆర్ తాను అరెస్ట్ తో  భయపడేది లేదని, జైలుకు వెళ్ళడానికి సిద్దమే అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.  కొడంగల్ తిరగబడిందని,  రేపు తెలంగాణ మొత్తం తిరగబడే పరిస్థితి ఉందని కేటీఆర్ అన్నారు. పదేపదే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు పేలనుందనే స్టేట్మెంట్ ఇవ్వడం, అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మాటల యుద్ధం చూస్తుంటే రాష్ట్రంలో రాజకీయ అరెస్టులు, జైల్లో వారు ఉండడం తప్పదు అనిపిస్తుంది.

అంత ఉలుకెందుకు?

జైలు, అరెస్టులకు జంకుతే ఎట్లా? ఢిల్లీలో సీఎంగా ఉండి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మనీష్ సిసోడియా, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్​, తమిళనాడులో సీఎంగా ఉండగా జయలలిత, మాజీ సీఎం కరుణానిధి ఇలా ఎందరో జైలుకు వెళ్లి రాలేదా!  తెలంగాణలో అరెస్ట్, జైలు అనంగానే, తాము అధికారంలో ఉన్నపుడు ఎంతోమందిని, అరెస్టులు చేయించి జైల్లో పెట్టించిన వారికి అంత ఉలుకు, భయం ఎందుకో! అంత ఆగమాగం అవుడు ఎందుకు? ప్రజల వెంట ఉండండి!  ప్రతిపక్ష హోదాజనం ఇచ్చారు. కాబట్టి, అంగీకరించండి.అధికారం కోల్పోవడం కేవలం బీఆర్ఎస్ స్వయంకృతాపరాధం. అరెస్టులు, జైలు, కక్షలు, ఇవన్నీ రాజకీయాల్లో కామన్! నిత్యం జనంతో, జనం మధ్యన ఉండాలని అనుకుంటే  బీ బ్రేవ్! లేదా  తోకముడుచుకుని కూర్చోవాల్సిందే. 

-  ఎండి. మునీర్, 
సీనియర్ జర్నలిస్ట్