లంచం ఇస్తేనే పనులు చేస్తున్నరు .. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సర్వేలో వెల్లడి

  • అవినీతికి కారణం ప్రభుత్వ ఉద్యోగులే

జూబ్లీహిల్స్, వెలుగు: ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి ఎక్కువగా ఉన్నదని, లంచం ఇవ్వనిదే పని జరగడం లేదంటూ మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. పల్నాటి రాజేందర్ ఆధ్వర్యంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ (ఎన్జీవో) సంస్థ రాష్ట్రంలో అవినీతిపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపారు. ఆఫీసులకు వెళ్లకుండా ఇంటి నుంచి పనులు పూర్తయితే అవినీతి తగ్గుతుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారని చెప్పారు. మొత్తం 14,345 మంది నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు వివరించారు. ఈ రిపోర్టును ఎర్రమంజిల్​లోని ఆఫీస్​లో లక్ష్మీనారాయణ బుధవారం విడుదల చేశారు. 

ట్రాన్స్​ఫెరన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రపంచ దేశాల్లో అవినీతి ఎలా ఉందన్న దానిపై సర్వే నిర్వహించి ఆయా దేశాలకు ర్యాంకులు ఇస్తుంటుందని లక్ష్మీనారాయణ చెప్పారు. ఇందులో ఇండియా 83వ ర్యాంకులో ఉందన్నారు. -రాష్ట్రంలోని ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి జరుగుతున్నదని 76 శాతం మంది అభిప్రాయపడినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. ‘‘14 శాతం మంది అవినీతి సాధారణంగా ఉందని చెప్పారు. లంచం ఇవ్వకపోతే పనులు జరగడం లేవని 47.90 శాతం మంది, అధికారులు ఇబ్బందులు పెడ్తున్నారని 28.40 శాతం మంది అభిప్రాయపడ్డారు. అధికారులు క్యాష్ రూపంలో లంచం తీసుకుంటున్నారని 63.70 శాతం మంది, వస్తువుల రూపంలో లంచం తీసుకుంటున్నారని 34.20 శాతం మంది చెప్పారు. 

తమ పరిధిలో నిజాయితీ అధికారులు లేరని 63శాతం మంది, ఉన్నారని 20 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏసీబీ, సీబీఐతో అవినీతి తగ్గుతదని 48.60 శాతం మంది, వాళ్లతో ఎలాంటి ప్రయోజనం లేదని 26 శాతం మంది చెప్పారు. లంచం ఇచ్చి పనులు చేయించుకుంటున్నామని 43శాతం మంది, న్యాయ పోరాటం చేసి పనులు చేయించుకుంటున్నట్లు 41శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇలా పలు అంశాలపై అభిప్రాయాలు సేకరించారు’’అని లక్ష్మీనారాయణ తెలిపారు.  రెవెన్యూ, విద్యుత్, రిజిస్ట్రేషన్, పోలీస్, మున్సిపల్ శాఖలు అవినీతిలో టాప్ 5లో నిలిచాయన్నారు.