- నెల రోజులుగా కొనసాగుతున్న ఫారెస్ట్ ల్యాండ్స్ సర్వే
- దేవునూరు శివారులో ఒక సర్వే నెంబర్కు బదులు మరోచోట సాగు
- మరికొందరి భూమి చేతులు మారిన వైనం
- సర్వేపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న రైతులు
- అభ్యంతరాలతో నత్తనడకన సాగుతున్న ఫారెస్ట్ భూముల సర్వే
హనుమకొండ/ ధర్మసాగర్, వెలుగు: తరచూ వివాదాస్పదమవుతున్న ఇనుపరాతి గుట్టల్లోని ఫారెస్ట్ భూముల లెక్క తేల్చేందుకు ఆఫీసర్లు చేపట్టిన సర్వేపై అన్నదాతల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, వేలేరు మండలాల్లో సర్వే చేపట్టగా, ధర్మసాగర్ మండలం దేవునూరు శివారు రైతుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. కొందరు రైతులు ఒక సర్వే నెంబర్ బదులు మరో సర్వే నెంబర్ లో సాగు చేసుకుంటుండగా, మరికొందరు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూమిని ఇతరులకు అమ్మేశారు. దీంతో ఇప్పుడు ఆ భూముల పరిస్థితి ఎలా ఉంటుందోనని అక్కడి రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేవునూరు శివారు రైతులు సర్వే చేపట్టేందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఆఫీసర్లు వారం రోజుల్లో పూర్తి చేస్తామన్న సర్వే కాస్త నత్తనడకన సాగుతోంది.
మూడు మండలాల్లో పూర్తి..
హనుమకొండ జిల్లాలోని ఏకైక ఫారెస్ట్ ఏరియా ఇనుపరాతి గుట్టల్లోనే విస్తరించి ఉంది. ధర్మసాగర్ మండలం దేవునూరు శివారులో 1,095 ఎకరాలు, ముప్పారం శివారులో 906, వేలేరు మండలం ఎర్రబెల్లిలో 820, భీమదేవరపల్లి మండలం కొత్తపెల్లిలో 594, ఎల్కతుర్తి మండలం దామెర శివారులో 560 ఎకరాలున్నట్లు ఆఫీసర్లు గతంలో గుర్తించారు. ఈ ఫారెస్ట్ భూములను ఆనుకునే చుట్టుపక్కల గ్రామాల రైతుల పట్టా భూములు ఉండగా, సరైన హద్దులు లేనికారణంగా అటవీశాఖ అధికారులు, అన్నదాతల మధ్య తరచూ వివాదాలు తలెత్తేవి. ముఖ్యంగా ధర్మసాగర్ మండలం దేవునూరు శివారు భూముల్లోనే ఈ సమస్య తీవ్రంగా ఉంది.
వాస్తవానికి ఇనుపరాతి గుట్టల్లోని ఫారెస్ట్ ఏరియాకు హద్దులు నిర్ణయించి, సమస్యను పరిష్కరించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నా అటవీ, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం లేక ఆ ప్రక్రియ జరుగలేదు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ సమస్యపై ఫోకస్ పెట్టారు. జిల్లా అధికారులతో చర్చించి, ఫారెస్ట్ ల్యాండ్స్సర్వే చేసి హద్దులు నిర్ణయించాల్సిందిగా సూచించారు. దీంతో నవంబర్ 22న అటవీ, రెవెన్యూశాఖల అధికారులు ఆ నాలుగు మండలాల్లో సర్వే మొదలుపెట్టారు. ఈ మేరకు భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, వేలేరు మండలాల్లో సర్వే పూర్తి చేశారు. కానీ ధర్మసాగర్ మండలంలోని దేవునూరు శివారు సర్వే మాత్రం పెండింగ్లో ఉంది.
గందరగోళంలో రైతులు..
దేవునూరు శివారులోని సర్వే నెంబర్ 531లో గతంలో ప్రభుత్వం 20 మంది రైతులకు తలా రెండెకరాల చొప్పున 40 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. కానీ, ఆ భూమి సాగుకు వీలు లేకుండా రాళ్లురప్పలతో ఉండటంతో అక్కడి రైతులు వ్యవసాయానికి అనువుగా ఉన్న సర్వే నెంబర్ 415లోని ప్రభుత్వ భూమిని దున్నుకుంటున్నారు. సర్వే నెంబర్ 636లో కూడా సుమారు వందెకరాలను కూడా రైతులకు పంపిణీ చేయగా, దానితోపాటు 415 సర్వే నెంబర్ లోని భూమిని ఫారెస్ట్ నోటిఫై చేయగా అందులో సాగు పనులు చేపట్టకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. తాజాగా ఆఫీసర్లు సర్వే చేపట్టగా, తమకు ఇచ్చిన దాంట్లో కాకుండా ఇతర సర్వే నెంబర్లలో సాగు చేస్తున్న రైతులు గందరగోళంలో పడ్డారు.
ఇదిలాఉంటే కొందరు రైతులు తమకు ప్రభుత్వం ఇచ్చిన భూములను ఇతరులకు అమ్ముకున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో సర్వే వల్ల తాము నష్టపోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అక్కడికి వెళ్లిన ఆఫీసర్లను సర్వే చేపట్టకుండా అడ్డుకున్నారు. ఫలితంగా ఫారెస్ట్ భూముల సర్వేకు దేవునూరు వద్ద బ్రేకులు పడినట్లయ్యింది. దీంతో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, స్థానిక రెవెన్యూ అధికారులు అక్కడి రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలాఉంటే రైతుల అభ్యంతరం నేపథ్యంలో సర్వేకు అడ్డంకులు ఏర్పడగా, వారం రోజుల్లో పూర్తి కావాల్సిన సర్వే కాస్త నెల రోజులైనా కంప్లీట్ కాలేదు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, సర్వేను త్వరగా పూర్తి చేయడంతోపాటు అటవీ, పట్టా భూములకు హద్దులు నిర్ణయించాలని స్థానికులు కోరుతున్నారు.
ఐదు రోజుల్లో పూర్తి చేస్తం..
ధర్మసాగర్ మండలంలోని ముప్పారం శివారులో అటవీ భూముల సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. దేవునూరు రైతులతో కూడా మాట్లాడి సర్వే చేస్తున్నాం. అక్కడ కూడా సర్వే నిర్వహించి, ఐదు రోజుల్లో పూర్తి చేస్తం.
సదానందం, ఎమ్మార్వో, ధర్మసాగర్