న్యూఢిల్లీ : విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు భారతీయ ఈక్విటీలలో దాదాపు రూ.19 వేల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టారు. ఇవి గత నెలలో కేవలం రూ. ఎనిమిది కోట్లు కాగా, సెప్టెంబర్‌లో రూ. 7,624 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయని డిపాజిటరీల డేటా వెల్లడించింది. అమెరికాలో ఇన్ఫ్లేషన్తోపాటు డాలర్ విలువ తగ్గడం ఇందుకు ప్రధాన కారణాలు. ఈ అవుట్‌ఫ్లోలకు ముందు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఆగస్టులో రూ. 51,200 కోట్లు జులైలో దాదాపు రూ. 5,000 కోట్ల వరకు షేర్లు కొన్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి వరుసగా తొమ్మిది నెలల పాటు విదేశీ ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేశారు. అమెరికాలో ఇన్ఫ్లేషన్ మోస్తరుగా ఉండటం, డాలర్, అమెరికా బాండ్ రాబడులు తగ్గుముఖం పట్టడంతో రానున్న రోజుల్లో ఎఫ్‌పీఐలు మరిన్ని షేర్లు కొనే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు.
ప్రభుత్వ డేటా ప్రకారం, ఈ నెల 1-–11 మధ్యకాలంలో ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో రూ.18,979 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల మొత్తం అవుట్‌ఫ్లో రూ.1.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఎఫ్‌పీఐలు అక్టోబర్‌లో మొదట్లో ఇన్వెస్ట్మెంట్లను అమ్మేశారు. గ్లోబల్ మార్కెట్‌లలో సెంటిమెంట్‌లలో కొంత మెరుగుదల నేపథ్యంలో అమ్మకాలు బాగా తగ్గాయి. నవంబర్ నెలలో ఇవి పుంజుకున్నాయి.
