మాగనూర్‌ హైస్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్‌..110 మంది స్టూడెంట్లకు అస్వస్థత

 

  • మధ్యాహ్న భోజనం తిని 110 మంది స్టూడెంట్లకు అస్వస్థత
  • మక్తల్, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కు 9 మంది తరలింపు
  •   హెచ్ఎం, ఇన్​చార్జ్ హెచ్ఎం సస్పెన్షన్, ఏజెన్సీ రద్దు

మాగనూర్/నారాయణపేట,వెలుగు: నారాయణపేట జిల్లా మాగనూరు హైస్కూల్‌లో బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. అన్నం, పప్పు, గుడ్డు తిన్న తర్వాత సుమారు 110 మంది తీవ్ర ఇబ్బందిపడ్డారు. వెంటనే టీచర్లకు సమాచారం ఇవ్వడంతో వారు స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ డాక్టర్‌ను స్కూల్‌కు పిలిపించారు. 15 మంది స్టూడెంట్లకు ఫస్ట్‌ ఎయిడ్‌ చేసి, తొమ్మిది మందిని మెరుగైన ట్రీట్‌మెంట్‌ కోసం మక్తల్‌ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఇందులో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్లిన మరికొందరు స్టూడెంట్లు పలు ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఫుడ్‌ పాయిజన్‌ విషయం తెలుసుకున్న డీఈవో అబ్దుల్‌ ఘనీ స్కూల్‌కు చేరుకొని విచారణ చేపట్టారు. స్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ జరగడం ఇది మూడోసారి అని పలు విద్యార్థి సంఘాల నాయకులు డీఈవోతో వాగ్వాదానికి దిగారు. వంట ఏజెన్సీ, హెచ్‌ఎం నిర్లక్ష్యం కారణంగానే ఫుడ్‌ పాయిజన్‌ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టూడెంట్ల తల్లిదండ్రులు స్కూల్‌ వద్దకు చేరుకొని వెంటనే వంట ఏజెన్సీని మార్చాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి స్టూడెంట్లను పరామర్శించి, ఫుడ్‌పాయిజన్‌ ఘటనపై ఆఫీసర్ల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

సీఎం ఆగ్రహం.. చర్యలకు ఆదేశం

ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆరా తీసినట్టు తెలిసింది. సీఎం మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో మాట్లాడి స్టూడెంట్ల పరిస్థితి తెలుసుకొని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. కలెక్టర్‌తో మాట్లాడి ఘటనకు గల కారణాలను తెలుసుకుని, స్టూడెంట్లకు మెరుగైన ట్రీట్‌మెంట్‌ అందించాలని ఆదేశించినట్లు తెలిసింది. 

ఇద్దరి సస్పెన్షన్, ఏజెన్సీ రద్దు

మాగనూర్ స్కూల్​ ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ స్కూల్ హెచ్ఎం మురళీధర్ రెడ్డి, ఇన్​చార్జ్ హెచ్‌ఎం బాపురెడ్డిని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ సస్పెండ్ చేసింది. అలాగే స్కూల్ మధ్యాహ్న భోజన ఏజెన్సీని కూడా రద్దు చేసింది.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి: సీఎం

హైదరాబాద్, వెలుగు: నారాయణపేట జిల్లాలోని మాగనూరు హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయా లన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. విద్యార్థు లకు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేసి, బాధ్యులెవరో పూర్తి వివరాలు తెలుసకొని నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు.