మాగనూరు జడ్పీ హైస్కూల్‌‌‌‌లో మళ్లీ ఫుడ్‌‌‌‌ పాయిజన్‌‌‌‌

మాగనూరు, వెలుగు: నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీహెచ్ఎస్‌‎లో మళ్లీ ఫుడ్‌‌‌‌ పాయిజన్‌‌‌‌ జరిగింది. గత బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన 110 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురైన ఘటన మరువకముందే.. మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 40 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. భోజనంలో అన్నం, వంకాయ, ఆలుగడ్డ తిన్న కొద్దిసేపటికే స్టూడెంట్లు కడుపునొప్పితో వాంతులు చేసుకున్నారు. అలర్ట్‌‌‌‌ అయిన టీచర్లు స్టూడెంట్లను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌‎కు తరలించారు.

13 మంది స్టూడెంట్లు కోలుకోగా, వారిని ఇండ్లకు పంపించారు. 27 మందికి వాంతులు అవుతుండడంతో మక్తల్ ఏరియా హాస్పిటల్‌‎కు తరలించారు. 9వ తరగతి చదువుతున్న మాగనూరు మండలం ఓబ్లాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన నేత్ర, వర్కూరు గ్రామానికి చెందిన దీపికకు సీరియస్‌‌‌‌గా ఉండడంతో వారిని మహబూబ్‌‌‌‌నగర్‌‏లోని జిల్లా జనరల్ హాస్పిటల్‌‎కు తరలించారు. మిగతా వారికి మక్తల్‌‏లోనే ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌అందిస్తున్నారు.

వరుస ఘటనలతో ఆఫీసర్లలో టెన్షన్‌‌‌‌

గత బుధవారం ఫుడ్‌‌‌‌పాయిజన్‌‌‌‌ జరిగి 110 స్టూడెంట్లు అస్వస్థతకు గురి గురికావడంతో హెచ్‌‌‌‌ఎంగా ఉన్న ఇన్‌‌‌‌చార్జి ఎంఈవోను సస్పెండ్‌‌‌‌ చేశారు. తర్వాతి రోజు నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్కూల్‌‎ను విజిట్‌‌‌‌ చేసి దగ్గరుండి వంటలు చేయించాలని నారాయణపేట డీఈవోతో పాటు ఆర్డీవో, ఎంపీడీవో, తహసీల్దార్లను ఆదేశించారు. అప్పుడు కూడా అన్నంలో పురుగులు కనిపించడంతో కలెక్టర్‌‌‌‌ ఫైర్‌‌‌‌ అయ్యారు. వెంటనే డీఈవోను వనపర్తికి ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేసి, ఆర్డీవోకు షోకాజ్‌‌‌‌ నోటీసులు జారీ చేశారు. 

దీంతో అలర్ట్‌‌‌‌అయిన ఆఫీసర్లు నాలుగు రోజులుగా స్కూల్ వద్దే ఉంటూ మధ్యాహ్న భోజనాలను తయారు చేయిస్తున్నారు. మంగళవారం కూడా ఫుడ్‌‌‌‌ పాయిజన్‌‌‌‌ జరగడంతో ఆఫీసర్లు ఆందోళన చెందుతున్నారు. ఫుడ్‌‌‌‌ పాయిజన్‌‌‌‌ ఎలా జరిగిందో తెలియక టెన్షన్‌‌‌‌ పడుతున్నారు. వంట చేసిన కార్మికులను, టీచర్లను డీఎస్పీ లింగయ్య పోలీస్‌‌‌‌ స్టేషన్‌‎కు తీసుకెళ్లి విచారించారు. అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ బెన్‌‌‌‌ షాలం, ఆర్డీవో రాంచందర్‌‌‌‌ మాగనూరుకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు.

బయటి తినుబండరాల వల్లే..

మాగనూరు జడ్పీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ స్టూడెంట్లు మంగళవారం మధ్యాహ్న భోజనానికి ముందు బేకరీలు, షాపుల్లో తినుబండారాలు కొనుక్కుని తిన్నారని, దీనివల్లే ఫుడ్‌‌‌‌ పాయిజన్‌‌‌‌ అయిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మధ్యాహ్న భోజనం వల్ల అస్వస్థతకు గురి కాలేదని విచారణలో  తెలిసిందని స్పష్టం చేశారు. గత వారం ప్రతి హాస్టల్, రెసిడెన్షియల్ సంస్థలను ఆఫీసర్లు సందర్శించారని, పాత బియ్యం బస్తాలన్నీ మార్చేశామని చెప్పారు.