- ఆయన చెప్పినట్లే చేసినం.. మేం సొంత నిర్ణయాలు తీసుకోలేదు
- అనధికారిక చెల్లింపులపై బీఎల్‌ఎన్ రెడ్డిని ప్రశ్నించిన ఈడీ
- ఫార్ములా–ఈ రేస్ కేసులో ఏసీబీ, ఈడీ దర్యాప్తు షురూ
- ఏసీబీ ముందు అర్వింద్.. ఈడీ ముందు బీఎల్‌ఎన్ రెడ్డి హాజరు
- హెచ్‌ఎండీఏ నిధుల విడుదలకు ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోలేదన్న అర్వింద్
- అత్యవసర పరిస్థితుల వల్లే అట్ల చేయాల్సి వచ్చిందని వ్యాఖ్య
- పైఆఫీసర్ల ఆర్డర్స్తోనే రెండు విడతలుగా ఫండ్స్ శాంక్షన్ చేశానన్న బీఎల్‌ఎన్ రెడ్డి
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారంగా ఈడీ ప్రశ్నల వర్షం
- ఆర్బీఐ రూల్స్ ఉల్లంఘన, అనధికారిక చెల్లింపులపై ఆరా
- నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్.. ఈడీ విచారణకు అర్వింద్
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా– ఈ రేసుకు సంబంధించిన అన్ని అగ్రిమెంట్లు నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలోనే జరిగాయని, ఆయన ఆదేశాల మేరకే చెల్లింపులు జరిపామని ఏసీబీ ఎదుట సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అర్వింద్‌కుమార్ వెల్లడించారు. రేస్ నిర్వహణ కోసం ఎంఏయూడీ, హెచ్‌ఎండీఏ నిధులను ఎట్ల ఖర్చు చేయాలనుకున్నది కూడా కేటీఆరే చెప్పారని ఆయన అన్నారు. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే హెచ్‌ఎండీఏ బోర్డు నుంచి నిధులు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈడీ ముందు హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఫార్ములా–ఈ రేస్ కేసు విచారణలో భాగంగా బుధవారం ఏసీబీ ముందు అర్వింద్‌కుమార్.. ఈడీ ముందు బీఎల్‌ఎన్‌రెడ్డి హాజరయ్యారు. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్‌లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్‌కు అర్వింద్ కుమార్ చేరుకున్నారు. ఎస్పీ, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు సహా మొత్తం ఐదుగురు సభ్యుల టీమ్.. సాయంత్రం 4.30 గంటల వరకు ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది.
2023 ఫిబ్రవరి 11న జరిగిన ఫార్ములా–ఈ రేస్ సీజన్ 9 కోసం రూ.12 కోట్లు చెల్లించడం, ఫార్ములా ఈ ఆపరేషన్స్, స్పాన్సర్ ఏస్ నెక్ట్స్ జెన్ మధ్య తలెత్తిన చెల్లింపుల వివాదం నేపథ్యంలో ఏస్ నెక్ట్స్‌జెన్ సీజన్ 10 నిర్వహణ నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత అప్పటి మున్సిపల్ మినిస్టర్ ఆదేశాల మేరకు ఎంఏయూడీ, ఎఫ్‌ఈవో మధ్య 2023 అక్టోబర్ 10న ఏ విధంగా అగ్రిమెంట్చేసుకున్నదీ ఏసీబీ అధికారులకు అర్వింద్‌కుమార్ వివరించినట్లు తెలిసింది.
అత్యవసర పరిస్థితి ఉన్నందునే..!
నాడు ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పరిమితులకు లోబడే తాను విధులు నిర్వర్తించినట్లు అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు. తన పరిధిలోని మున్సిపల్ శాఖ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను అతిక్రమించలేదని వెల్లడించారు. నిధుల కేటాయింపులు, ఖర్చుకు సంబంధించిన విధివిధానాలను, ప్రభుత్వ జీవోల ఆధారంగా అర్వింద్‌కుమార్ తన స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. ఏసీబీ ప్రధానంగా ఫార్ములా– ఈ రేస్‌కు సంబంధించిన అగ్రిమెంట్స్‌పై ఆరా తీసింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్(ఎఫ్‌ఈవో) ప్రపోజల్స్ ఎవరు తీసుకువచ్చారనే కోణంలో విచారించింది. ఈ క్రమంలోనే మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, ఎఫ్‌ఈవో, గ్రీన్‌కో సిస్టర్ సంస్థ ఏస్ నెక్స్ట్ జెన్ మధ్య 2022 అక్టోబర్ 25న జరిగిన త్రైపాక్షిక ఒప్పందం గురించి అర్వింద్‌కుమార్ వివరించినట్లు సమాచారం.
కాగా, సీజన్ 10 నిర్వహణ కోసం ఎఫ్‌ఈవో,హెచ్‌ఎండీఏ బోర్డు మీటింగ్ నిర్వహించినట్లు అర్వింద్‌కుమార్ తెలిపారు. ఇదంతా నాటి మున్సిపల్, ఎంఏయూడీ శాఖ మంత్రి ఆమోదంతో జరిగిందని వెల్లడించారు. గడువులోగా సొమ్ము చెల్లించకపోతే రేస్ రద్దయ్యే ప్రమాదం ఉన్నందున అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదని.. అదీగాక హెచ్‌ఎండీఏ బోర్డ్ నుంచి చెల్లింపు కోసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్గానీ, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు గానీ అవసరం లేదని అర్వింద్‌కుమార్ చెప్పినట్లు తెలిసింది. ఈక్రమంలోనే హెచ్‌ఎండీఏ బోర్డు అకౌంట్ నుంచే ఫార్ములా ఈ ఆపరేషన్స్‌కు రూ.45.71 చెల్లించినట్లు అర్వింద్ కుమార్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
దీంతో పాటు రూ. 8 కోట్లు ఇన్‌కమ్ ట్యాక్స్ కూడా బోర్డు నిధుల నుంచే చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి నాడు మున్సిపల్ మినిస్టర్ సూచనలతో రెండు విడతలుగా హెచ్‌ఎండీఏ బోర్డ్ అకౌంట్ ద్వారా ఎఫ్‌ఈవోకు చెల్లించామని, ఇదంతా అప్పటి హెచ్‌ఎండీఏ బోర్డ్ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి నిర్వహించారని అర్వింద్‌కుమార్ తన స్టేట్‌మెంట్‌లో ఏసీబీకి వెల్లడించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
అనధికారిక చెల్లింపులపై ఈడీ ఆరా
ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను ఏసీబీ విచారిస్తున్న సమయంలోనే ఇదే కేసులో హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. ఈడీ ఆదేశాల మేరకు బీఎల్‌ఎన్‌రెడ్డి బుధవారం ఉదయం 9.40 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. ముగ్గురు సభ్యుల ఈడీ అధికారుల బృందం ఆయనను విచారించింది. సాయంత్రం 6.30 గంటల వరకు ప్రశ్నించింది. నాడు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రెండు విడతలుగా రూ.45.71 కోట్లు శాంక్షన్ చేసినట్లు బీఎల్‌ఎన్‌రెడ్డి వెల్లడించారు.
ప్రధానంగా హిమాయత్‌నగర్‌లోని ఇండియన్ ఓవర్‌సిన్ బ్యాంక్‌లో గల హెచ్‌ఎండీఏ బోర్డ్ అకౌంట్స్ ఆపరేషన్స్ గురించి ఈడీ అధికారులు ఆరా తీశారు. 2023 అక్టోబర్ 11న జరిగిన ట్రాన్సాక్షన్లకు సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్లను ముందటపెట్టి బీఎల్‌ఎన్‌రెడ్డిని ప్రశ్నించారు. ఆర్బీఐ రూల్స్‌కు విరుద్ధంగా జరిగిన ఫారిన్ ఎక్స్చేంజ్‌కు సంబంధించి వివరాలు సేకరించారు. బ్రిటన్‌కు తరలించిన డబ్బుకు సంబంధించి ప్రభుత్వ జీవోలు లేకపోవడంతో అనధికారిక బదలాయింపులుగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని బీఎల్‌ఎన్ రెడ్డికి ఈడీ అధికారులు స్పష్టం చేశారు.
నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్.. ఈడీ ముందుకు అర్వింద్
ఫార్ములా –ఈ రేస్ కేసులో ఏసీబీ,ఈడీ ఎంక్వైరీలు ఏకకాలంలో ప్రారంభమయ్యాయి. దర్యాప్తులో భాగంగా బుధవారం ఒకవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ ఏసీబీ ఎదుట.. హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీలక్ష్మీనర్సింహా రెడ్డి(బీఎల్‌ఎన్‌రెడ్డి) ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఏసీబీ,ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు వీరిద్దరూ దాటవేయకుండా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఫార్ములా –ఈ రేస్ ఒప్పందాలు, హెచ్‌ఎండీఏ నిధుల విడుదల, బ్రిటన్‌కు తరలింపునకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడించినట్లు సమాచారం.
పైనుంచి వచ్చిన ఆదేశాలను పాటించాం తప్ప తాము సొంత నిర్ణయాలు తీసుకోలేదని, ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి వ్యక్తిగత లబ్ధి చేకూరలేదని చెప్పినట్లు తెలిసింది. వీరిద్దరి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన అధికారులు.. మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరుకావాలని సూచించారు. ఇదే కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఏసీబీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. ఇదే కేసులో గురువారం అర్వింద్ కుమార్ ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. బీఎల్‌ఎన్‌రెడ్డి శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. ఈ ముగ్గురి స్టేట్‌మెంట్స్‌ను పరిగణనలోకి తీసుకుని మరోసారి క్రాస్ క్వశనింగ్ చేసేందుకు ఏసీబీ, ఈడీ అధికారులు రెడీ అవుతున్నారు.