రాష్ట్రమంతా ముసురు..మరో రెండు రోజులు ఇదే పరిస్థితి

  • 6 జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి వాన
  • పడిపోయిన ఉష్ణోగ్రతలు.. 8 డిగ్రీలకు పతనం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంపై మబ్బులు కమ్ముకున్నాయి. మంగళవారం రాత్రి నుంచే పలు జిల్లాల్లో ముసురు పట్టింది. బుధవారం హైదరాబాద్​ సహా పదికిపైగా జిల్లాల్లో తేలికపాటి వాన కురిసింది. 16 జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి జల్లులుపడ్డాయి. అత్యధికంగా వరంగల్​ జిల్లా నల్లబెల్లి, దుగ్గొండిల్లో 1.5 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా చోట్ల సెంటీమీటర్​ లోపు వర్షం కురిసింది. 

అయితే, చాలా జిల్లాల్లో పగటి పూట చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 8 డిగ్రీల వరకు టెంపరేచర్​ పడిపోయింది. మధ్యాహ్నం కూడా స్వెటర్లు వేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే చాన్స్​ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో చెదురు మదురు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 

భిన్నమైన వాతావరణ పరిస్థితులు

రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం సాయంత్రం నుంచే మబ్బులు పట్టినా.. చలిగాలులు వీచినా రాత్రి టెంపరేచర్లలో మాత్రం పెరుగుదల నమోదైంది. అంతకుముందు రోజుతో పోలిస్తే నైట్ టెంపరేచర్లు 3 డిగ్రీల నుంచి 8.4 డిగ్రీల వరకు పెరిగాయి. మంగళవారం రాత్రి అత్యల్పంగా ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండలో 15.7  డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్​ జిల్లా మర్పల్లిలో 16.6, సంగారెడ్డి జిల్లా కోహిర్​లో 16.9, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కెరమెరిలో 17, నిర్మల్​ జిల్లా వానాలపహాడ్​లో 17.8 డిగ్రీల చొప్పున రాత్రి టెంపరేచర్లు రికార్డయ్యాయి.

మిగతా జిల్లాల్లో 18 డిగ్రీలకుపైగానే నైట్​ టెంపరేచర్​ నమోదైంది. హైదరాబాద్​ సిటీ పరిధిలోని అబ్దుల్లాపూర్​మెట్​లో 18.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయ్యాయి. మరోవైపు బుధవారం పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 8 డిగ్రీల కనిష్ట టెంపరేచర్​ నమోదైంది. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలలోపే నమోదయ్యాయి. నిజమాబాద్​ జిల్లాలో గరిష్టంగా 30.2 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది.  

పగటి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా హనుమకొండలో 22 డిగ్రీలు, హైదరాబాద్​లో 23 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్​నగర్​లో 25.1, రామగుండంలో 25.5, భద్రాచలంలో 26.4, మెదక్​లో 26.6, ఖమ్మంలో 27.4, నల్గొండలో 27.5, ఆదిలాబాద్​లో 29.8 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 

అకాల వర్షంతో రైతులకు తప్పని ఇబ్బందులు 

మహబూబాబాద్/ తాడ్వాయి, వెలుగు : మహబూబాబాద్, ములుగు​జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రోజంతా ముసురు పడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహబూబాబాద్​జిల్లాలో 234 ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయగా, చాలాచోట్ల ధాన్యం సేకరణ చివరిదశకు వచ్చింది. తాజా వానతో దంతాలపల్లి, నరసింహులపేట, కేసముద్రం, కురవి, నెల్లికుదురు, బయ్యారం, గార్ల, కొత్తగూడ మండలాల పరిధిలో ని పలు కొనుగోలు సెంటర్లలో ధాన్యం తడిసిపోయింది. కుప్పలు, వడ్ల బస్తాల కిందికి నీరు చేరడంతో మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.  

కాగా, గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో 13.6 మిల్లి మీటర్లు, కేసముద్రం 11.4, నెల్లికుదురు 18.6, నరసింహులపేట 19.8 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల ఆరబోసిన ధాన్యం తడవంతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.