న్యూఢిల్లీ: మరింత మందికి ఉద్యోగాలు వచ్చేలా చేయడంపై, పన్నుల వసూళ్లను పెంచడంపై.. రాబోయే ఆర్థిక సంవత్సర బడ్జెట్ దృష్టి పెడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ విధానంలో, వ్యక్తిగత పన్నుల శ్లాబుల్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా వసూళ్లను పెంచవచ్చని అన్నారు. ప్రి–బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆమె సోమవారం కొన్ని పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. ‘‘అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులు మరికొంతకాలం వరకు బాగుండకపోవచ్చు. అందుకే మనం మన ఎకానమీపై ఫోకస్ చేయాలి. కొత్త సెక్టార్ల గ్రోత్‌ను పెంచి మరిన్ని ఉద్యోగాలు వచ్చేలా చేయాలి. ఉపాధి పెరగడం వల్ల దేశీయంగా డిమాండ్ అధికమవుతుంది. ఆర్థికాభివృద్ధి ఫలితాలు అందరికీ దక్కుతాయి” అని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ అన్నారు. ఈ సంఘం నాయకులు వర్చువల్ విధానంలో ప్రి–బడ్జెట్ సమావేశంలో ఆర్థికమంత్రితో మాట్లాడారు. మరిన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్ల వాటాలను ప్రైవేటు కంపెనీలకు అమ్మాలని కోరారు. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేయాలని కోరారు. గ్లోబల్ మార్కెట్లలో సమస్యలు ఉన్నందున మార్కెట్లోకి మరింత డబ్బు వచ్చేలా చూడాలని రిక్వెస్ట్ చేశారు. ఉద్యోగాల సంఖ్యను పెంచడానికి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌ను అమలు చేయాలని ఈ సంఘం కోరింది. పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమును అమలు చేయాలని, మొదట ఈ స్కీమును మెట్రో సిటీల్లో అమలు చేయాలని రిక్వెస్ట్ చేసింది. ఇందుకోసం ఈ బడ్జెట్‌లో నిధులను పెంచాలని సూచించింది. వ్యాపారాలు మరింత ముందుకు సాగడానికి ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ విధానాన్నే కొనసాగించాలని సీఐఐ విజ్ఞప్తి చేసింది. పన్నుల వివాదాలు సులభంగా పరిష్కారమయ్యేలా చూడాలని మంత్రిని కోరామని సీఐఐ ప్రెసిడెంట్ వెల్లడించారు.
రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో మీటింగ్స్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం రాష్ట్రాల ఆర్థికమంత్రులతో ముందస్తు బడ్జెట్ సంప్రదింపులు జరపనున్నారు. ఏటా ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ముందు మంత్రి నిర్వహించే సంప్రదాయ సమావేశాల్లో ఇదొక భాగం. ఈ నెల 25న ఢిల్లీలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రీ-బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. 2023–-24 బడ్జెట్ కోసం పరిశ్రమల సంఘాలు, కొన్ని రంగాల నిపుణుల నుంచి సూచనలను కోరేందుకు సీతారామన్ సోమవారం ప్రి–బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారు. మంగళవారం ఆమె వ్యవసాయం, వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఆర్థిక రంగం, క్యాపిటల్ మార్కెట్ ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇదే నెల 24వ తేదీన వర్చువల్ మోడ్‌లో ఆరోగ్యం, విద్య, నీరు, పారిశుద్ధ్యంతో సహా సామాజిక రంగానికి చెందిన నిపుణులతో మాట్లాడతారు. సేవల రంగం, వాణిజ్య సంస్థల ప్రతినిధులను కూడా కలవనున్నారు. వచ్చే ఏడాది బడ్జెట్‌లో అధిక ధరల తగ్గింపు, డిమాండ్‌ను పెంచడం, ఉద్యోగాల కల్పన, ఆర్థిక వ్యవస్థను వృద్ధి మార్గంలో ఉంచడం వంటి సమస్యలను ఆమె పరిష్కరించాల్సి ఉంటుంది. ఇది సీతారామన్ ప్రవేశపెడుతున్న ఐదవ బడ్జెట్.
