17వేల 500కోట్ల విలువైన ఆస్తులను రికవరీ చేశాం: నిర్మలా సీతారామన్

బ్యాంకులను మోసం చేసి పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి రూ.17,750 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రికవరీ చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు తెలిపారు. 

మాల్యాకు చెందిన రూ.14,131.6 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు బదిలీ చేయగా.. నీరవ్ మోదీ నుంచి రూ.1,052.58 కోట్లు, చోక్సీ నుంచి రూ.2,565.90 కోట్ల ఆస్తులు కూడా రికవరీ అయ్యానని నిర్మలా సీతారామన్ చెప్పారు. 

లోక్‌సభలో మొదటి బ్యాచ్ సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పై జరిగిన చర్చకు ఆమె సమాధానమిస్తూ పారిపోయిన విజయ్ మాల్యాకు చెందిన రూ.14,131.6 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు బదిలీ చేసినట్లు చెప్పారు.

ALSO READ | జమిలి ఎన్నికలపై జేపీసీ.. కమిటీలో 21 మంది లోక్ సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు

నీరవ్ మోదీ కేసుకు సంబంధించి రూ.1,052.58 కోట్ల ఆస్తులను పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇతర ప్రైవేట్ బ్యాంకులకు బదిలీ చేసినట్టు తెలిపారు. మెహుల్ చోక్సీ కేసులో రూ.2,565.90 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయగా వేలం వేయనున్నారు. 

బాధితులు లేదా నిజమైన హక్కుదారులకు రూ. 22,280 కోట్ల విలువైన ఆస్తులను ఇడి రికవరీ చేసింది ఆర్థిక నేరగాళ్లపై పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 

విదేశీ నల్లధనానికి సంబంధించి 2015 నాటి నల్లధనం చట్టం చాలా వరకు నిరోధక ప్రభావాన్ని చూపుతోందని ఆర్థిక మంత్రి అన్నారు. పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులను వెల్లడించేందుకు స్వయంగా ముందుకు వస్తున్నారని 2024నుంచి -25 నాటికి విదేశీ ఆస్తులను వెల్లడించే పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2 లక్షలకు చేరుకుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.