జూరాలకు కొనసాగుతున్న వరద..39 గేట్లు ఓపెన్ చేసి నీటి విడుదల

గద్వాల, వెలుగు : కర్నాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ తో పాటు కృష్ణ ఉపనది అయిన భీమా నది నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు 39 గేట్లు ఓపెన్  చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి పూర్తిస్థాయి నీటిమట్టం 123.081 టీఎంసీలు కాగా.. 100.537 టీఎంసీల నీటిని నిలువ ఉంచుకొని 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టుకు 2,06,500 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తున్నది. నారాయణపూర్  డ్యామ్  పూర్తి స్థాయి నీటిమట్టం 33.313 టీఎంసీలకు గాను

28.048 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొని 25 గేట్లను ఓపెన్ చేసి 1,29,750 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టుకు 1.50 లక్షల క్యూసెక్కులు  ఇన్ ఫ్లోగా వస్తున్నది. భీమా నది(సన్నతి బ్యారేజ్) నుంచి 1.22 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు దగ్గర 4.598 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొని, 39 గేట్లు ఓపెన్  చేసి 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టుకు 2.96 లక్షల క్యూసెక్కులు ఇన్​ఫ్లోగా ఉంది.