గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్‌తోపాటు అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ను ముగ్గురు వ్యక్తులు కాల్చిచంపిన ఘటనలో యూపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఆ ఘటన జరగకుండా నిరోధించడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు రావడంతో దర్యాప్తునకు ఆదేశించింది యోగి సర్కార్. ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసింది.
షాహగంజ్ పోలీస్ సీనియర్ అధికారి అశ్వని కుమార్ సింగ్‌తోపాటు ఓ ఇన్‌స్పెక్టర్, మరో ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు పోలీసులను ప్రశ్నించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT).. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించింది. ఈ ఐదుగురు పోలీసులు కూడా షాహగంజ్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. హత్య జరిగిన మెడికల్ కాలేజీ ప్రాంతం ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తుంది.
పోలీస్ కస్టడీలో ఉన్న అతీక్ అహ్మద్, అతడి సోదరుడు ఏప్రిల్ 15వ తేదీ రాత్రి మీడియా కెమెరాల ముందు దారుణ హత్యకు గురయ్యారు. వారి చుట్టూ పోలీసులు, మీడియా ప్రతినిధులు, లైవ్ కెమెరాలు ఉండగానే.. పాయింట్ బ్లాకులోకి వచ్చి కాల్చి చంపారు ముగ్గురు నిందితులు. అతిక్, అష్రఫ్ లను వైద్య పరీక్షల కోసం ప్రయాగ్‌రాజ్‌లోని షాహ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఆస్పత్రికి తీసుకువెళ్తున్న సమయంలో జర్నలిస్టులమని చెప్పి వచ్చిన ముగ్గురు యువకులు అతి దగ్గర నుంచి కాల్చి చంపారు. అప్రమత్తమైన పోలీసులు నిందితులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వారిని ప్రయాగ్‌రాజ్ కోర్టులో ప్రవేశపెట్టగా నాలుగురోజుల పాటు పోలీస్ కస్టడీ విధించింది. ఇప్పటికే ముగ్గురు నిందితుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసిన దర్యాప్తు బృందం.. సీన్ రీక్రియేషన్ చేపట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు ఈ కాల్పుల ఘటనపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఇప్పటికే ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
యూపీ గ్యాంగ్‌స్టర్ అతిఖ్ అహ్మద్ , అతడి సోదరుడు అష్రఫ్ హత్య కేసులపై దాఖలైన పిటిషన్‌ను ఈనెల 24న సుప్రీంకోర్టు విచారించనుంది. అతిఖ్ హత్యపై సీబీఐతో లేదా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు అతిఖ్ హత్యపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని లాయర్ విశాల్ తివారి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూపీలో జరిగిన 180 ఎన్‌కౌంటర్లపై దర్యాప్తు జరపాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
