చిన్నపొర్ల ఘటనలో ఐదుగురికి రిమాండ్

  •     కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ యోగేష్ గౌతమ్

ఊట్కూర్, వెలుగు: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం చిన్నపొర్లలో గురువారం జరిగిన హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఊట్కూర్ ఠాణాలో కేసు వివరాలను ఎస్పీ యోగేష్ గౌతమ్ శనివారం వెల్లడించారు.  దాడికి పాల్పడిన మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసి, ఐదుగురిని రిమాండ్​ తరలించామన్నారు. ఏ1గా ఉన్న వెంకటప్ప హైదరాబాద్​ఉస్మానియా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా, ఏ3 ఆటో సంజన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఏ2 గువ్వల సంజీవ్, ఏ4 వెంకటప్ప అలియాస్ నట్టల్, ఏ5 గుడ్డి ఆశప్ప అలియాస్ అశోక్, ఏ6 గువ్వలి శ్రీను, ఏ7 గువ్వల కిష్టప్ప రిమాండ్​కు ​తరలించామని వివరించారు.  

చిన్న పొర్ల ఘటనలో ఎస్సై శ్రీనివాసులు నిర్లక్ష్యంగా వహించడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. డయల్  100కు చేసిన సమయంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై విచారించి శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనలో క్షేత్రస్థాయిలో విచారించి మరికొందరిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎవరినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్రామంలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చేంతవరకు పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తామని వివరించారు. కార్యక్రమంలో మక్తల్ సీఐ చంద్రశేఖర్, సీఐ రామ్ లాల్, మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

సంజీవ్ కుటుంబాన్ని ఆదుకోవాలి 
 

ఊట్కూర్, వెలుగు: పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఊట్నూర్ మండలంలోని చిన్నపొర్లలో సంజీవ్(28) హత్యకు గురయ్యాడని ఉమ్మడి జిల్లా ఎస్సీఆర్పీఎస్, ప్రజా సంఘాల నాయకులు యాంటి రమేశ్, కామారం వెంకటేశ్, రామన్నలు ఆరోపించారు. శనివారం సంజీవ్ అంత్యక్రియలు జరిగగా, వారు  పాల్గొన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్​ను కలిసి మెమోరాండం అందజేశారు. బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని, సంజీవ్ భార్య అనితకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.