అమేజింగ్ ఫీట్: 10 కి.మీ.ను గంటలో పూర్తి చేసిన గర్భిణి

అమేజింగ్ ఫీట్: 10 కి.మీ.ను గంటలో పూర్తి చేసిన గర్భిణి
బెంగళూరు: ఆరోగ్యంగా ఉండాలంటే నడక, యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకోవాలి. పరిగెత్తడం కూడా మంచి హాబీనే. రన్నింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇదంత సులువు కూడా కాదు. ముఖ్యంగా ఐదు నుంచి పది కిలోమీటర్లు లాంటి ఎక్కువ దూరాలు పరిగెత్తాలంటే చాలా శక్తి, శరీరంలో పటుత్వం కావాలి. అలాంటిది ఓ ఐదు నెలల గర్భిణి 10 కిలో మీటర్ల రేసును కేవలం 62 నిమిషాల్లో పూర్తి చేసి ఔరా అనిపించింది. బెంగళూరులో ఆదివారం నిర్వహించిన టీసీఎస్ వరల్డ్ 10కే బెంగళూరు 2020లో అంకితా గౌర్ అనే మహిళ పాల్గొంది. గంటలో నిర్ణీత దూరాన్ని పూర్తి చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. చాలా సంవత్సరాలుగా అంకితకు పరిగెత్తడం అలవాటు. గత తొమ్మిదేళ్లుగా ఆమె పరుగును సాధన చేస్తోంది. రన్నింగ్ గురించి అంకిత స్పందించింది. ‘గత తొమ్మిదేళ్ల నుంచి రన్నింగ్ చేస్తున్నా. ఇన్నేళ్లలో గాయాలైనప్పడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు తప్ప దాదాపుగా ప్రతి రోజూ పరిగెడుతున్నా. దెబ్బలు తాకినప్పుడు వెనుకంజ వేయడం మామూలే. కానీ తిరిగి రన్నింగ్‌‌ను మొదలెట్టేదాన్ని. పరుగు అనేది నాకు ఊపిరి పీల్చుకోవడం లాంటిదే. రన్నింగ్ చాలా సురక్షితమైంది. ప్రెగ్నెన్సీ టైమ్‌‌లో రన్నింగ్ చేయడం మంచి ఎక్సర్‌‌సైజ్. రన్నర్‌‌లు ఏదైనా చేయొచ్చునని అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ సూచించింది. నా గైనకాలజిస్ట్‌‌ను సంప్రదిస్తే పరుగుకు అభ్యంతరం చెప్పలేదు. నేను ఇంతకుముందు 10కే రేస్‌‌ల్లో గెలిచా. కానీ ఈసారి మాత్రం ప్రెగ్నెన్సీ కారణంగా మధ్యమధ్యలో కొంత విరామం తీసుకుంటూ, నడుచుకుంటూ పరుగును పూర్తి చేశా’ అని అంకిత పేర్కొంది.