HMPV పాతదే.. భయం వద్దు..కేంద్రం క్లారిటీ

  • వైరస్ పాతదే.. టెన్షన్ అక్కర్లేదు
  • దేశంలో హెచ్ఎంపీవీ కేసుల నమోదుపై కేంద్రం
  • మొత్తం 5 కేసులు నమోదయ్యాయని వెల్లడి
  • కర్నాటకలో 2, తమిళనాడులో 2, గుజరాత్​లో ఒక్కటి చొప్పున రికార్డు
  • ఏడాదిలోపు చిన్నారులకు సోకిన వైరస్  
  • ఆందోళన చెందాల్సిన పనిలేదన్న ఐసీఎంఆర్

చైనాలో వ్యాప్తి చెందుతున్న హ్యూమన్ మెటా నిమో వైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు మన దేశంలోనూ నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఐదు కేసులు రికార్డయ్యాయి. అయితే హెచ్ఎంపీవీ వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదని ఐసీఎంఆర్ తెలిపింది. 

 ఈ వైరస్​ పాతదేనని, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని  స్పష్టం చేసింది. దేశంలో ఇన్ ఫ్లూయెంజా, తీవ్ర శ్వాసకోశ వ్యాధుల లాంటి కేసులు అసాధారణ రీతిలో ఏమీ లేవని పేర్కొంది.  ఒకవేళ వైరస్ వ్యాప్తి పెరిగినా, దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఎక్విప్ మెంట్ మన దగ్గర ఉన్నదని పేర్కొంది.

న్యూఢిల్లీ: చైనాలో వ్యాప్తి చెందుతున్న హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు మన దేశంలోనూ నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 5 కేసులు రికార్డయ్యాయి. కర్నాటకలో 2, తమిళనాడులో 2, గుజరాత్ లో ఒక్కటి చొప్పున నమోదయ్యాయి. వైరస్​ సోకిన 3 నెలల పాప కోలుకుని ఇప్పటికే డిశ్చార్జ్ కాగా.. మిగతా వాళ్లు ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. 

కాగా, హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదని ఐసీఎంఆర్ తెలిపింది. ఈ వైరస్ పాతదేనని ఇప్పటికే ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని స్పష్టం చేసింది. దేశంలో ఇన్ ఫ్లూయెంజా, తీవ్ర శ్వాసకోశ వ్యాధుల లాంటి కేసులు అసాధారణ రీతిలో ఏమీలేవని పేర్కొంది. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని చెప్పింది. వైరస్​ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఎక్విప్​మెంట్ మన దగ్గర ఉందని పేర్కొంది.

మూడు రాష్ట్రాల్లో నమోదు..  

కర్నాటకలోని బెంగళూర్​లో రెండు హెచ్ఎంపీవీ కేసులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గుర్తించిందని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ‘‘బ్రాంకో నిమోనియాతో బాధపడుతున్న 3 నెలల పాపను బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్​లో అడ్మిట్ చేయగా హెచ్ఎంపీవీ పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఆ పాప కోలుకుని ఇప్పటికే డిశ్చార్జ్ అయింది. 

అలాగే బ్రాంకో నిమోనియాతోనే బాధపడుతున్న 8 నెలల బాబును కూడా బాప్టిస్ట్ హాస్పిటల్ లోనే అడ్మిట్ చేయగా, ఈ నెల 3న హెచ్ఎంపీవీ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాబు కోలుకుంటున్నాడు” అని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ పిల్లల తల్లిదండ్రులకు ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేదని తెలిపింది. ఇక గుజరాత్​లోని అహ్మదాబాద్​లో 2 నెలల బాబుకు హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చింది. 

‘‘ఈ బాబుది రాజస్తాన్. శ్వాసకోశ సమస్యతో బాధపడుతుండడంతో పేరెంట్స్ అహ్మదాబాద్ తీసుకొచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్​లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం బాబును ఐసోలేషన్​లో ఉంచాం. అతడు కోలుకుంటున్నాడు” అని వైద్యాధికారులు తెలిపారు. కాగా, చెన్నైలో ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకిందని అధికారులు తెలిపారు.

మాస్క్ పెట్టుకోండి: కర్నాటక అడ్వైజరీ

ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్నాటక సర్కార్ తెలిపింది. కరోనా వైరస్ లెక్క హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో రెండు కేసులు నమోదైన నేపథ్యంలో అడ్వైజరీ జారీ చేసింది. ‘‘ముఖానికి మాస్క్ పెట్టుకోవాలి. సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఫ్లూ లక్షణాలుంటే పబ్లిక్ ప్లేసులలోకి వెళ్లొద్దు. కర్చీఫ్స్, టవల్స్, టిష్యూ పేపర్స్ ను రీయూజ్ చేయొద్దు. పబ్లిక్ ప్లేసులలో ఉమ్మి వేయవద్దు” అని సూచించింది.