- దశాబ్ద కాలంగా నిలిచిన విత్తన ఉత్పత్తి
- శిథిలమవుతున్న సిమెంట్ నర్సరీలు
సిద్దిపేట/కోహెడ, వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరంలో ఏర్పాటు చేసిన చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం పనికి రాకుండా పోతోంది. దాదాపు నలభై లక్షల చేప పిల్లలు ఉత్పత్తి చేసే ఈ కేంద్రం దశాబ్దకాలంగా నిరుపయోగంగా మారింది. కోహెడ మండలం సిద్దిపేట జిల్లాలో చేరిన తర్వాత పలు కారణాలతో చేప పిల్లల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.1964లో శనిగరం మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు వద్ద 4 ఎకరాల విస్తీర్ణంలో 40 నుంచి 50 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి చేసేందుకు అనువుగా ఈ ప్రాజెక్టు ను ఏర్పాటు చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పది మండలాల మత్స్యకారుల కోసం ఏర్పాటు చేసిన ఈ కేంద్రం కాలక్రమంలో శిథిలావస్థకు చేరింది. కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు ఈ కేంద్రం ద్వారా డివిజన్ లోని అన్ని చెరువులు, కుంటలకు చేప పిల్లలు సరఫరా చేసేవారు. అప్పుడు వరంగల్ జిల్లా నుంచి సైతం మత్స్య కారులు ఇక్కడకు వచ్చి చేపపిల్లలను తీసుకెళ్లే వారు కానీ సిద్దిపేట జిల్లాలో కలిసిన తర్వాత చేప పిల్లలను ఉత్పత్తి చేయడం లేదు.
సీడ్ రేరింగ్ కే పరిమితం
నలభై లక్షల పై చిలుకు చేప పిల్లలను ఉత్పత్తి చేసే కేంద్రాన్ని కేవలం సీడ్ రేరింగ్ కోసమే వాడుతున్నారు. గతంలో పూర్తి స్థాయి సిబ్బంది పనిచేసే కేంద్రంలో నామ మాత్రంగా విధులు నిర్వహించే ఉద్యోగులు ఉంటున్నారు. శనిగరం చెరువును ఆనుకొని నాలుగు ఎకరాల్లో నిర్మించిన భవనంతో పాటు ఇతర నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.
8 సిమెంటు నర్సరీలకు పగుళ్లు ఏర్పడగా నర్సరీలకు నీళ్లు పంపిణీ చేసే బోరు చెడిపోయింది. నీళ్ల ట్యాంకు లీకేజీతో నీరు వృథాగా పోతోంది. గతంలో నామ మాత్రంగా ఇచ్చిన నిధులతో కొనుగోలు చేసిన టార్ఫాలిన్ కవర్లు అలంకార ప్రాయంగా మారాయి. నిర్వహణ లోపంతో ప్రధాన భవనం కళావిహీనంగా మారింది. ఒకప్పుడు చేప పిల్లల ఉత్పత్తిలో వెలుగు వెలిగిన కేంద్రం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. భవిష్యత్అవసరాల కోసమైనా శనిగరం చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని రిపేర్చేసి సంరక్షించాలని మత్స్యకారులు కోరుతున్నారు.