రామాయణ గాధతో ముడిపడిన ప్రఖ్యాత ఆలయాలు, విశిష్ట ప్రదేశాలను చూడాలని భావించే వారికి గొప్ప అవకాశం. రామాయణ సర్క్యూట్ ను కనెక్ట్ చేసే తొలి పర్యాటక రైలును ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. దాని పేరు ‘భారత్ గౌరవ్’. ఈ రైలు ప్రతి బోగీ రామాయణంలోని ఒక్కో ఘట్టాన్ని, ఒక్కో రామాలయాన్ని అద్దంపట్టే దృశ్యాలభరితంగా ఉంటుంది. రామాయణ గాధతో ముడిపడిన ఎన్నో విఖ్యాత ఆలయాలు భారత్, నేపాల్లలో ఉన్నాయి. వాటన్నింటిని ఈ రైలు అనుసంధానిస్తుంది.
జూన్ 21న జర్నీ షురూ..
జూన్ 21న దీని జర్నీ మొదలుకానుంది. ఇది ఢిల్లీ నుంచి బయలుదేరి 8000 కిలోమీటర్లు ప్రయాణించి నేపాల్ లోని జనక్ పూర్ కు చేరుకుంటుంది. మొత్తం 18 రోజుల టూర్ ప్యాకేజీ విలువ రూ.62వేలు( ఒకరికి). ఈ టికెట్ ను బుక్ చేసుకొని ఈఎంఐ పై టికెట్ చార్జీని చెల్లించే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ ట్రైను లో మొత్తం 600 సీట్లు, 11 ఏసీ త్రీ టైర్ కోచ్ లు ఉన్నాయి. ‘భారత్ గౌరవ్’ రైలు మొదటి స్టాప్ అయోధ్య. అక్కడ పర్యాటకులు దిగి రామ జన్మభూమి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. కాగా, తెలంగాణలోని భద్రాచలం, తమిళనాడులోని రామేశ్వరం, హంపి, పంచవటి (నాసిక్), చిత్రకూట్, ప్రయాగ్ రాజ్, వారణాసి, సీతామడి, నందిగ్రామ్, అయోధ్యలను అనుసంధానిస్తూ మరో ప్రత్యేక రూట్ లోనూ ‘భారత్ గౌరవ్’ రైలును నడపనున్నారు.
