హిమాయత్ నగర్​లో మినర్వా హోటల్​లో అగ్నిప్రమాదం

  • కిచెన్​లో చెలరేగిన మంటలు
  • ఆపై బిల్డింగ్​పైకి ఎగసిపడ్డ అగ్నికీలలు
  • సకాలంలో ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది

బషీర్ బాగ్, వెలుగు: హిమాయత్ నగర్​లోని మినర్వా హోటల్​లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్ రెండో అంతస్తులోని కిచెన్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆపై కిచెన్ ఎగ్జాస్ట్ నుంచి హోటల్ బిల్డింగ్ పైకి మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడం, చుట్టుపక్కల అపార్ట్​మెంట్లు ఉండటంతో  స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

స్థానికుల సమాచారంతో నారాయణగూడ పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని, సకాలంలో మంటలు అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హోటల్ కిచెన్​లో చెలరేగిన మంటల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు నారాయణగూడ సీఐ వెంకటేశ్ తెలిపారు. ఈ ప్రమాదం లో ఏ మేరకు ఆస్తి నష్టం జరిగిందన్నది తెలియరాలేదు. మంటలు అదుపులోకి వచ్చిన అనంతరం హోటల్ యథావిధిగా కొనసాగింది.