హైదరాబాద్ జీడిమెట్లలో అగ్ని ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్..

కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని దూలపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రిషిక కెమికల్ గోడౌన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీ పొగలు, మంటలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటీవల హైదరాబాద్ పారిశ్రామికవాడల్లో అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

జనవరి 2న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి దూలపల్లి వెళ్లే రోడ్డులో ఫెవికల్ గమ్, టెర్పెంట్ ఆయిల్ లోడ్తో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించి డ్రైవర్ లారీని పక్కకు ఆపాడు. మంటల్లో లారీ పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు, ప్రమాదానికి కారణాలను ఆరా తీశారు.

ALSO READ | లాంగ్ డ్రైవ్ వెళ్లేవారికి అలర్ట్: పల్సర్ బైక్ లో మంటలు.. పూర్తిగా కాలిపోయింది..

హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ వారం రోజుల వ్యవధిలోనే పలు అగ్ని ప్రమాదాలు జరిగాయి. కొండాపుర్లో భారి అగ్ని ప్రమాదం జరిగింది. కొండాపూర్లోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ 9వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. ఘటన జరిగిన సమయంలో నలుగురు కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో ఉన్నారు.

ఎగిసిపడుతున్న మంటలను చూసి  భయభ్రాంతులకు గురై ఇంట్లో ఉన్న వాళ్లంతా వెంటనే కిందకు రావడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.