- పెబ్బేరు మార్కెట్ గోదాంలో రక్షణ చర్యలు కరవు
- ఏఫ్రిల్ 1న రూ. 12.85 లక్షల గన్నీ బ్యాగులు, 23 వేల బస్తాల ధాన్యం అగ్నికి అహుతి
- ఎనిమిది నెలలు దాటినా నిందితులు ఎవరన్నదీ తేల్చలే
వనపర్తి/పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు మార్కెట్ యార్డు గోదాంలో 2024, ఏప్రిల్1న జరిగిన అగ్ని ప్రమాదంలో సీఎంఆర్ ధాన్యం, సివిల్‌సప్లయ్ డిపార్టుమెంట్‌కు చెందిన గోనె సంచులు కాలిపోగా ఇప్పటికీ నిందితులు ఎవరన్నదీ తేల్చలేదు. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో దాదాపు 23 వేల బస్తాల ధాన్యం, రూ.12.85 లక్షల గోనెసంచులు కాలినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్వరగా విచారణ చేపట్టాలని ఆదేశించినా ఇప్పటి వరకు జిల్లా అధికారులు నామమాత్రంగానే తనిఖీలు చేసి విడిచిపెడుతున్నారు. దీంతో ఈ ఘటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ప్రమాదమా.. పథకం ప్రకారం చేశారా?
అగ్నిప్రమాదం జరిగి ఎనిమిది నెలలు గడుస్తున్నా బాధ్యులు ఎవరో తేలకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రబీలో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలోని పెబ్బేరు గోదాంలో 12.85 లక్షలు, గోపాల్‌పేటలో 25.37లక్షలు, వనపర్తి మండలం చిట్యాల గోదాం 3.20 లక్షల గోనెసంచులను నిల్వ ఉంచారు. కాగా ఫైర్ యాక్సిడెంట్ కాకముందు పెబ్బేరు గోదాం నుంచి ఏకంగా 7 లక్షల గన్నీ బ్యాగులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదం జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరగడానికి మూడు రోజుల ముందు గోదాం వెనక ఉన్న ఒక కిటీకీ తెరుచుకొని ఉన్నట్లు విజిట్‌కు వచ్చిన ఆఫీసర్లు గుర్తించారు. ఇదేమని అప్పటి అడిషనల్ కలెక్టర్ ప్రశ్నించగా గాలి కోసం తెరిచారని అధికారులు సమాధానం చెప్పినట్లు తెలిసింది.
పర్యవేక్షణ కరవు
మార్కెట్ యార్డుకు సంబంధించి ఎలాంటి భద్రత లేదు. ఈ క్రమంలోనే గోదాముల వెనక ఉన్న ఖాళీ ప్రదేశం మందు బాబులకు అడ్డాగా మారిందని స్థానికులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన గన్నీ బ్యాగులను ఇన్సూరెన్సు డిపార్టుమెంటు వారు పరిశీలించి అంచనా వేశారని సివిల్ సప్లయి ఆఫీసర్లు చెప్పారు. పెబ్బేరు పోలీస్‌స్టేషన్ అధికారులను వివరణ కోరగా, ఎంక్వయిరీ చేస్తున్నామని, ప్రత్యేక బృందాలు మార్కెట్ యార్డు చుట్టూ గస్తీ తిరుగుతున్నాయని, అనుమానితులను ఎంక్వయిరీ చేస్తున్నామని చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత కూడా యార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.