సికింద్రాబాద్ మోండా మార్కెట్‎లో అగ్ని ప్రమాదం.. క్షణాల్లోనే ఐదు షాపులకు మంటలు

హైదరాబాద్‎లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం (డిసెంబర్ 19) తెల్లవారుజూమున సికింద్రాబాద్ మోండా మార్కెట్‎లోని పూజ సామాగ్రి దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లోనే వరుసగా ఐదు షాపులకు వ్యాపించాయి. పూజా సామాగ్రి దుకాణంతో పాటు పక్కనే ఉన్న ఓ ప్లాస్టిక్ వస్తువుల షాపుకు మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల  సహయంతో మంటలను  అదుపు చేశారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్ సీఐ మహమ్మద్ అలీ తెలిపారు. మొత్తం మూడు ఫైర్ ఇంజన్స్‎తో పూర్తిగా మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఏరియా చిన్నదిగా ఉండడం వల్ల మంటలను అర్పేందుకు కొంచెం ఇబ్బంది అయ్యిందని అన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఎవరికీ ఏమికాకపోవడంతో స్థానికులు,  పోలీసులు, అధికారులు ఊపిరీ పీల్చుకున్నారు. మార్కెట్‎లో అగ్ని ప్రమాదంతో వ్యాపారులు భయాందోళనకు గురి అయ్యారు.