నిర్మాణంలోని అమర్​రాజా కంపెనీలో అగ్ని ప్రమాదం

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్​పోర్టు ఆవరణలో నిర్మాణంలో ఉన్న ‘అమర్ రాజా’ బ్యాటరీల కంపెనీ బిల్డింగ్​లో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 150 కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడో అంతస్తుకు వ్యాపించాయి. దీంతో కార్మికులు బయటికి పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫైర్​సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు మూడు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎంత మేరకు నష్టం జరిగిందో, ప్రమాదానికి కారణం ఏమిటో తెలియాల్సి ఉంది.