ఫినోతో మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు

ఫినోతో మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: దేశంలో ఆరు లక్షల ఆరవై వేల గ్రామాలున్నాయి. రూరల్ ప్రాంతాల్లో బ్యాంకులు పెట్టడం లాభదాయకం కాదు. కానీ, అందరికి బ్యాంకింగ్ సేవలు కచ్చితంగా అందాలి. ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి ముందుకొస్తున్నాయి పేమెంట్‌‌‌‌ బ్యాంకులు. వీటికి పెద్ద పెద్ద బ్రాంచులు అవసరం లేదు. మనకు చుట్టుపక్కల ఉన్న కిరాణా షాపులు లేదా మర్చంట్లే ఈ బ్యాంకులకు ఒక బ్యాంక్‌‌‌‌ బ్రాంచుగా, ఏటీఎంగా పనిచేస్తున్నాయి. డిజిటల్‌‌‌‌ టెక్నాలజీని వాడుకుంటూ దేశంలోని మారుమూలలకు బ్యాంకింగ్ సర్వీస్‌‌‌‌లను విస్తరిస్తున్న మొట్ట మొదటి లిస్టెడ్ పేమెంట్స్ బ్యాంక్‌‌‌‌  ఫినో, ప్రస్తుతం సౌత్‌‌‌‌లో కూడా మరింతగా విస్తరించాలని ప్లాన్స్ వేసుకుంది. ముఖ్యంగా   ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో  విస్తరించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఫినో పేమెంట్స్ బ్యాంక్‌‌‌‌ చీఫ్‌‌‌‌ సేల్స్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ శైలేష్ పాండే ‘వెలుగు’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  కంపెనీకి సంబంధించి అనేక  విషయాలు పంచుకున్నారు. 

బ్రాంచులు లేకుండానే ఫినో అందిస్తున్న బ్యాంకింగ్ సర్వీస్‌‌‌‌లు సక్సెస్ అవుతున్నాయా?

శైలేష్‌‌‌‌: రెండు తెలుగురాష్ట్రాల్లో 29 వేల  గ్రామాలు ఉన్నాయి.  గ్రామాల్లో  బ్రాంచులను పెట్టడం బ్యాంకులకు లాభదాయకం కాదు. అందుకే టెక్నాలజీ సాయంతో బ్యాంకులనే కస్టమర్ల దగ్గరకు తెస్తున్నాం. ఎన్‌‌‌‌ఎబీఎఫ్‌‌‌‌సీలు లేదా బ్యాంకులతో పార్టనర్‌‌‌‌‌‌‌‌షిప్ కుదుర్చుకొని కస్టమర్లకు గోల్డ్ లోన్లు, కన్జూమర్ లోన్లను ఇస్తున్నాం. పేమెంట్ బ్యాంకులు డైరెక్ట్‌‌‌‌గా లోన్లను ఇవ్వడానికి కుదరదు. అందుకే బ్యాంకులు లేదా ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలతో కలిసి బ్యాంకింగ్ సేవలను మారుమూలలకు విస్తరిస్తున్నాం. మా బ్యాంకింగ్ మోడల్‌‌‌‌లో మన చుట్టుపక్కల ఉండే కిరాణా షాపులు లేదా మర్చంట్లు ఒక బ్యాంక్ బ్రాంచ్‌‌‌‌గా లేదా మైక్రో ఏటీఎంగా పనిచేస్తాయి. వీటి దగ్గర కస్టమర్లు కొత్తగా బ్యాంక్‌‌‌‌ అకౌంట్లను ఓపెన్ చేసుకోవచ్చు. క్యాష్‌‌‌‌ డిపాజిట్లు, విత్‌‌‌‌డ్రాయల్స్‌‌‌‌, ట్రాన్స్‌‌‌‌ఫర్ వంటి సర్వీస్‌‌‌‌లను పొందొచ్చు.  ఫినోకి దేశం మొత్తం మీద ఇలాంటి పాయింట్లు 8.6 లక్షలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 65 వేల పాయింట్లు ఉన్నాయి. వీరి దగ్గర ఫినో కస్టమర్లు బ్యాంకింగ్ సర్వీస్‌‌‌‌లను పొందొచ్చు. సౌత్‌‌‌‌లోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా మరింతగా విస్తరించేందుకు ప్లాన్స్ వేసుకున్నాం. గ్రామాలు, మారుమూల ప్రాంతాలలో కూడా బ్యాంకింగ్ సర్వీస్‌‌‌‌లను విస్తరించడమే మా ముఖ్యమైన టార్గెట్‌‌‌‌. ట్రాన్సాక్షన్లు పెరిగే కొద్ది మా పార్టనర్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌కు, మాకు, మర్చంట్లకు ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ పెరుగుతుంది. కస్టమర్లకు అందుబాటులో బ్యాంకింగ్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లు ఉంటాయి.

రెమిటెన్స్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను అందించేకు అప్రూవల్స్ వచ్చాయి. ఈ సర్వీస్‌‌‌‌లను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు?

శైలేష్‌‌‌‌: మనీ ట్రాన్స్‌‌‌‌ఫర్ సర్వీస్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ కింద విదేశాలకు, అక్కడి నుంచి మన దేశానికి మనీ ట్రాన్స్‌‌‌‌ఫర్ చేసుకునే సర్వీస్‌‌‌‌ను అందించడానికి ఫినోకి అనుమతులొచ్చాయి. ఇంకో 3–6 నెలల్లో ఈ సర్వీస్‌‌‌‌లను స్టార్ట్ చేస్తాం. కస్టమర్ల కోసం మొబైల్ బ్యాంకింగ్ యాప్ ‘ఫినోపే’ తీసుకొచ్చాం. మ్యూచువల్‌‌‌‌ ఫండ్‌‌‌‌, ఫిక్స్​డ్​ అండ్ రికరింగ్‌‌‌‌ డిపాజిట్‌‌‌‌, డిజిటల్ గోల్డ్‌‌‌‌ వంటి సర్వీస్‌‌‌‌లను అందించేందుకు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం.

డిజిటల్ పేమెంట్స్‌‌‌‌కు ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. దీనిని ఎలా వాడుకుంటున్నారు?

శైలేష్‌‌‌‌: ప్రభుత్వం డిజిటలైజేషన్‌‌‌‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఆధార్‌‌‌‌ ఎనబుల్డ్‌‌‌‌ పేమెంట్ సిస్టమ్‌‌‌‌ను, యూపిఐ, జన్‌‌‌‌ధన్ అకౌంట్లు వంటివి తీసుకొచ్చింది. ప్రభుత్వం కోరుకుంటున్నట్టు రూరల్ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు చేరుకోవడంలో ఫినో సాయపడుతుంది. కస్టమర్లకు, మర్చంట్లకు, మాకు లాభం చేకూర్చే మరిన్ని ఇనొవేటివ్ ప్రొడక్ట్‌‌‌‌లను తీసుకొస్తాం.