హెల్సింకి/కీవ్: రష్యా సరిహద్దు దేశమైన ఫిన్లాండ్ కీలక ప్రకటన చేసింది. నాటో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకునే విషయంలో తాము సుముఖంగా ఉన్నామని ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలీ నీనిస్టో, ప్రధాని సనా మారిన్ వెల్లడించారు. ‘‘నిర్ణయం తీసుకోవాల్సిన సమయం దగ్గర్లోనే ఉంది. ఫిన్లాండ్ భద్రతను నాటో మెంబర్‌షిప్ బలోపేతం చేస్తుంది. నాటో మెంబర్‌గా.. మొత్తం రక్షణ కూటమిని ఫిన్లాండ్ బలోపేతం చేసుకుంటుంది. ఎలాంటి ఆలస్యం లేకుండా నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేయాలి. ఈ నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన చర్యలను వేగంగా తీసుకుంటాం” అని గురువారం ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. మిలిటరీ సహకార ఒప్పందంపై సంతకం చేయడానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ఫిన్లాండ్, స్వీడన్ దేశాల్లో పర్యటించిన తర్వాతి రోజే ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు ఫిన్లాండ్ పక్కనే ఉన్న స్వీడన్ కూడా నాటోలో చేరడంపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. రష్యాతో 1,340 కిలోమీటర్ల మేర సరిహద్దును ఫిన్లాండ్ పంచుకుంటున్నది. ఇంగ్లండ్ నేతృత్వంలోని ‘జాయింట్ ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్ (జేపీఎఫ్)’లో 2017లోనే ఫిన్లాండ్, స్వీడన్ చేరాయి. నాటోతో పోలిస్తే మరింత వేగంగా స్పందించేలా ఈ కూటమిని రూపొందించారు. నాటో సిద్ధంతాలను, ప్రమాణాలను కూడా ఈ ఫోర్స్ పాటిస్తుంది. 2018 నుంచి జేపీఎఫ్ పూర్తి స్థాయిలో పని చేస్తోంది.
మాకు ముప్పే: రష్యా
నాటోలో చేరాలన్న ఫిన్లాండ్ నిర్ణయం తమకు కచ్చితంగా ముప్పేనని రష్యా చెప్పింది. మిలిటరీని విస్తరించినంత మాత్రాన యూరప్ లేదా ప్రపంచం మరింత స్థిరంగా ఉండబోవని కామెంట్ చేసింది. ఫిన్లాండ్ నిర్ణయానికి ప్రతిస్పందనగా మిలిటరీ–సాంకేతిక చర్యలు తీసుకోవాల్సి వస్తుందని రక్షణ శాఖ హెచ్చరించింది. నాటోలో చేరాలని స్వీడన్, ఫిన్లాండ్ నిర్ణయించుకుంటే.. సైనిక, రాజకీయ పరిణామాలు ఉంటాయని గతంలోనే రష్యా హెచ్చరించింది.
ఉక్రెయిన్ లో కొనసాగిన దాడులు
ఉక్రెయిన్ లోని చెర్నిహివ్ రీజియన్‌లో బుధవారం రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో ముగ్గురు చనిపోగా, 12 మంది గాయపడ్డారు. నోవ్‌హొరోడ్– సివర్‌స్కీ టౌన్‌లో ఓ బోర్డింగ్ స్కూల్, డార్మిటరీ, ప్రభుత్వ బిల్డింగ్ ధ్వంసమైనట్లు చెర్రిహివ్ గవర్నర్ చెప్పారు. ఇక్కడి రెండు అమ్యూనిషన్ డిపోలను పేల్చేసినట్లు రష్యా ప్రకటించింది. అయితే, జీవించే హక్కును రష్యా తిరిగి ఇచ్చినప్పుడే యుద్ధం ముగుస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ఖేర్సన్ సిటీని కలిపేసుకుంటామన్న రష్యాపై ఆయన మండిపడ్డారు. సూడో రెఫరెండం నిర్వహిస్తే శాంతి చర్చలకు విఘాతం తప్పదని హెచ్చరించారు.
