- హైలెవెల్ కమిటీ సలహాలు, సూచనలు
- ఇతర అకౌంట్ల నుంచి ఆటో డెబిట్
- డిఫాల్టర్‌గా ప్రకటన..
న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసులు భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో వాటిని తగ్గించడంపై ఫైనాన్స్ మినిస్ట్రీ ఫోకస్ పెడుతోంది. ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయితే ఇచ్చిన వారికి ఉన్న ఇతర బ్యాంకు అకౌంట్ల నుంచి ఆ మొత్తాన్ని ఆటో డెబిట్ చేయడం, అలాంటి వారు కొత్త బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయకుండా పరిమితులు విధించడం వంటి చర్యలను మినిస్ట్రీ పరిశీలిస్తోంది. ఇటీవల జరిగిన ఒక హైలెవెల్ మీటింగ్‌లో నిపుణులు కొన్ని సలహాలు, సూచనలను ఇవ్వడంతో వాటిలో కొన్నింటిని అమలులోకి తేవాలని ఫైనాన్స్ మినిస్ట్రీ ప్లాన్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. చెక్‌బౌన్స్‌ను లోన్ డిఫాల్ట్‌గా ట్రీట్ చేసి, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు రిపోర్ట్ చేయాలనే సూచన కూడా ఈ హైలెవెల్ మీటింగ్‌లో వచ్చినట్లు పేర్కొన్నాయి. దీనివల్ల వారి క్రెడిట్‌స్కోరు తగ్గుతుంది. ఈ సూచనలను కూలంకషంగా పరిశీలించి, లీగల్ఎఫెక్ట్నూ స్టడీ చేయాలనే నిర్ణయానికి ఫైనాన్స్ మినిస్ట్రీ వచ్చినట్లు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.
హై లెవెల్ మీటింగ్‌లో వచ్చిన సలహాలు, సూచనలలో కొన్నింటినైనా అమలులోకి తెస్తే చెక్‌బౌన్స్ కేసులు బాగా తగ్గే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో దేశంలోని కోర్టులపై చెక్‌బౌన్స్ కేసుల ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. టెక్నాలజీ సాయంతో చెక్ బౌన్స్ చేసిన వ్యక్తిని ఇతర మార్గాలలో చెల్లింపు వెంటనే జరిపేలా ఒత్తిడి పెంచొచ్చనే సూచన కూడా ఉంది. ఇలాంటి చొరవ వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడుతుందని, ఉద్దేశపూర్వకంగా చెక్కులను బౌన్స్ చేయడం తగ్గుతుందని ఎక్స్పర్టులు చెబుతున్నారు. అన్ని బ్యాంకుల డేటాను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా పైన పేర్కొన్న సలహాలు, సూచనలను అమలులోకి తేవొచ్చని పేర్కొంటున్నారు. దాంతోపాటు ఆటో డెబిట్, ఇతర సూచనలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తేవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దేశంలోని వివిధ కోర్టులలో మొత్తం 35 లక్షలకుపైగా చెక్‌బౌన్స్ కేసులు పేరుకుపోయాయి. దీంతో వీటిని తొందరగా పరిష్కరించడం కోసం సుప్రీం కోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. చెక్‌బౌన్స్ కేసుల సత్వర పరిష్కారానికి అదనపు కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే దానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా సుప్రీం కోర్టు విచారణలో ఒప్పుకుంది. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ప్రొసీజరల్ రిఫార్మ్స్ కొన్నింటిని రికమెండ్ చేసింది.
