- భారీగా ఆర్ధిక ఉద్దీపన ప్రాజెక్టులు ప్రకటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- వైద్య రంగానికి 50 వేల కోట్లు
- మొత్తం లక్షా 10వేల కోట్ల రుణాలకు కేంద్రం గ్యారెంటీ
న్యూఢిల్లీ: కరోనాతో దెబ్బతిన్న ప్రధాన రంగాల పునరుజ్జీవనంపై దృష్టి సారించిన కేంద్రం ఆదుకునేందుకు 8 కొత్త ఆర్ధిక ఉపశమన చర్యలను ప్రకటించింది. ఆరోగ్య సంరక్షణకు 50 వేల కోట్లు, మిగిలిన రంగాలకు 60 వేల కోట్లతో ఆర్దిక ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది. రూ. లక్షా 10వేల కోట్ల రుణాలకు కేంద్రం గ్యారెంటీ ప్రకటించింది. తాజాగా ప్రకటించిన మొత్తం 8 రాయితీలలో ఆరు కొత్తవి కావడం విశేషం.
సోమవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీ వివరాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కరోనాతో దెబ్బతిన్న రంగాలకు 1.1 లక్ష కోట్ల రుణ గ్యారెంటీ పధకం ప్రకటించారు. అలాగే ప్రత్యేక వైద్య మౌళిక సదుపాయాల కోసం 50 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య ఆరోగ్య రంగానికి సేవలను అందించే సంస్థలకు అండగా నిలుస్తామని ఆమె తెలిపారు. ముఖ్యంగా పిల్లలపై దృష్టి సారించి ప్రజా ఆరోగ్యం కోసం రూ.23 వేల కోట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన పథకాన్ని వచ్చే మార్ 31 వరకు పొడిగించామని తెలిపారు.
మెట్రోల విస్తరణకు.. కొత్త వాటికి కూడా
8 మెట్రోలు మినహా మిగిలిన నగరాల్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు గ్యారెంటీ కవర్ ఇస్తామని నిర్మలా సీతారామన్ వివరించారు. విస్తరణ కోసమైతే 50 శాతం, కొత్త ప్రాజెక్టులకైతే 75 శాతం రుణానికి గ్యారెంటీ ఇస్తామన్నారు. గ్యారెంటీ గడువును మూడేళ్లు నిర్దేశించినట్లు వివరించారు. గ్యారెంటీ లేని రుణాలపై వడ్డీ 10 నుంచి 11 శాతం వసూలు చేస్తుండగా.. ఈ రుణాలపై మాత్రం 7.95 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తామని తెలిపారు. ఇతర రంగాలకు 8.25 శాతం వడ్డీకి 60 వేల కోట్ల రుణాలు కేటాయిస్తారు.
