ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడ్తున్నం : భట్టి విక్రమార్క

  • రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పులకుప్ప చేసింది: ఆర్థిక మంత్రి భట్టి
  • హైదరాబాద్ ​చుట్టూ శాటిలైట్ టౌన్​షిప్​లు నిర్మిస్తం
  • త్వరలోనే జాబ్​క్యాలెండర్ ​రిలీజ్​ చేస్తం
  • ఎస్సీ, ఎస్టీ నిధులు వందశాతం వారికేఉపయోగిస్తం
  • అనతికాలంలోనే ప్రజాపాలనకు అంకురార్పణ చేసినం
  • పూర్తి రాష్ట్ర బడ్జెట్​నుపెట్టడం ఆనందంగాఉన్నదని కామెంట్


హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా.. తాము సంక్షేమాన్ని మాత్రం విస్మరించలేదని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు.  రాష్ట్రం అప్పుల పాలయ్యిందని తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు భట్టి విక్రమార్క రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర పూర్తి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకుముందు అసెంబ్లీలోని కమిటీహాల్​లో సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన కేబినెట్​సమావేశమై, రాష్ట్ర బడ్జెట్​కు ఆమోదం తెలిపింది.  

సభలో భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ కలను సాకారం చేసిన  సోనియా గాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పూర్తి రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉన్నదని తెలిపారు. గత పదేండ్ల అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చరమగీతం పాడిన రాష్ట్ర ప్రజానీకానికి  ప్రభుత్వం తరుఫున కృతజ్ఞతలు చెప్పారు.  ఈ 8 నెలల్లో అనేక పథకాలను అమలు చేశామన్నారు. ఇప్పటి వరకు రూ.34,579 కోట్లు వివిధ పథకాలపై ఖర్చు చేసినట్టు వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత కరెంట్, రైతు భరోసా, బియ్యంపై సబ్సిడీలు, చేయూత, సంక్షేమంతోపాటు మూలధన వ్యయానికి కూడా అదనంగా  రూ.19,456 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.   

6.71 లక్షల కోట్లకు అప్పు

చిలికి చిలికి గాలి వాన అయినట్టు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న రూ.75,577 కోట్ల  అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి రూ.6.71 లక్షల కోట్లకు చేరిందని భట్టి తెలిపారు. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర అభివృద్ధి జరగలేదని చెప్పారు.  గత దశాబ్ద కాలంలో పాలకులు తీసుకున్న తప్పుడు విధాన నిర్ణయాలు, నాణ్యత లేని పనుల కారణంగా సాగు నీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయని తెలిపారు.  గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తమ ఒంటెత్తు పోకడలతో భ్రష్టు పట్టించిందని అన్నారు.  తలకు మించిన అప్పుల భారం ఉన్నప్పటికీ, దుబారా ఖర్చులు కట్టడి చేసి, ఆర్థిక క్రమశిక్షణతో తాము పాలన ప్రారంభించామని చెప్పారు. ఈ ఏడాది మార్చి నుంచి 3.69 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 2.87 లక్షల మంది పెన్షన్​దారులకు క్రమం తప్పకుండా ప్రతి నెలా మొదటి తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు  ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. 

బకాయిలు చెల్లించినం

2023 డిసెంబర్ లో తమ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే నాటికి రూ. 6,71,757 కోట్ల అప్పులు ఉన్నట్టు తేలిందన్నారు.  తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.35,118 కోట్ల అప్పులు తీసుకోగా.. గత ప్రభుత్వం చేసిన అప్పుల్లో అసలు, వడ్డీలతో కలిపి రూ. 42,892 కోట్లు బకాయిలను చెల్లించామన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న రుణాల కన్నా రూ.7,774 కోట్టు ఎక్కువగా రుణాలు ఈ కొద్ది నెలల్లోనే చెల్లించడం ద్వారా తమ చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు.  తాము అధికారంలోకి వచ్చాక పోలీసు, వైద్య , ఇతర రంగాల్లో ఇప్పటికే 31,768 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను ఏటేటా భర్తీ చేసేందుకు త్వరలోనే జాబ్​క్యాలెండర్​రిలీజ్​ చేస్తామని వెల్లడించారు. 

రుణమాఫీలో మా చిత్తశుద్ధినే శంకిస్తున్నరు!

“ఏదైనా పని జరిగే వరకు అది అసాధ్యంగా గోచరిస్తుంది”  అని నెల్సన్ మండేలా చెప్పిన మాటలు కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీ హామీకి అక్షరాలా వర్తిస్తాయని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.  గత సర్కార్​ పలు దఫాల్లో నిధులు విడుదల చేయడంతో అసలు కూడా తీరకపోవడంతోపాటు రైతులపై వడ్డీ భారం పెరిగిందన్నారు.  చేతగానమ్మకు మాటలెక్కువన్నట్టు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు తమ చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నించారని.. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారన్నారు. 

2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న పంటరుణాలన్నింటికీ మాఫీ వర్తింప జేస్తూ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.  జులై 18న లక్ష రూపాయల వరకు రుణం ఉన్న 11.34 లక్షల రైతన్నలకు రూ.6,035 కోట్ల  రుణమాఫీ మొత్తాన్ని వారి ఖాతాల్లో ఒకేసారి జమ చేసినట్టు తెలిపారు. రూ.2 లక్షల వరకు రుణం ఉన్న మిగతా రైతులకు కూడా అతి త్వరలో మాఫీ  చేస్తామన్నారు.  రైతు భరోసా అమలుకు విధివిధానాలు చర్చించి నిర్ణయించడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.  మొత్తం ప్రతిపాదిత బడ్జెట్ లో సింహభాగం అంటే రూ.72,659 కోట్లు వ్యవసాయ రంగానికి ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. 

రైతు కూలీలకు రూ.12 వేలు

భూమిలేని లక్షలాది రైతు కూలీల ఆర్థిక, జీవన స్థితిగతులు మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నదని భట్టి తెలిపారు.  అలాగే, ధరణి సమస్యలను పరిష్కరించడానికి స్పెషల్ డ్రైవ్​ను నిర్వహించి, 1.79 లక్షల అప్లికేషన్లను పరిష్క రించినట్టు చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు మహిళలకు రూ. 2,351 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. రూ.500 కే గ్యాస్​సిలిండర్​స్కీమ్​ ద్వారా 39,57,637 కుటుంబాలకు లబ్ధి చేకూరి నట్టు తెలిపారు. గృహజ్యోతి పథకం కింద జూన్ వరకు అందించిన విద్యుత్తుకుగాను డిస్కంలకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 583.05 కోట్లు చెల్లించిందని చెప్పారు. ధాన్యానికి 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నామన్నారు. 2010–11 నుంచి 2022–23 సంవత్సరాల మధ్య సుమారు 1,000 మంది మిల్లర్లు ప్రభుత్వానికి దాదాపు 3,000 కోట్లు బకాయి పడ్డారన్నారు.   గత ఆరు నెలలుగా విజిలెన్స్ విభాగం మిల్లర్లపై దాడులు చేస్తూ బకాయిలు రాబట్టిందన్నారు. 

ఎస్టీ, ఎస్టీ నిధులు.. వందశాతం వారికే..

ఎస్టీ, ఎస్టీల అభివృద్ధికి చట్టపరంగా కేటాయించిన నిధులను వందశాతం వారికోసమే  ఖర్చు చేస్తామని భట్టి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జనరల గు రుకుల పాఠశాలలను 20 ఎకరాల స్థలంలో ఒకే చోట నిర్మిస్తామని చెప్పారు. కులగణన చేపడుతామ ని తెలిపారు. నిజాం షుగర్స్ లిమిటెడ్​ను పునఃప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో సెంటర్ అఫ్ ఎక్స్​లెన్స్ ఫర్ టెక్నికల్ టెక్స్ టైల్స్  ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్​ కమిషన్​ విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. తుది దశలో ఉన్న ప్రాజెక్టులు, ఆయకట్టు తక్షణం పెంపొందించే 6  ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో..  12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించామన్నారు. 65 ప్రభుత్వ ఐటీఐలను ప్రైవేట్​ సంస్థల సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మార్చే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్​తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. 

ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నం

ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని మంత్రి భట్టి తెలిపారు. మొదట మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర మహిళలలందరికీ  ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించినట్టు చెప్పారు.  రైతుభరోసాతోపాటు ఇతర హామీలన్నింటినీ అమలు చేసి తీరుతామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే ప్రజాపాలనకు అంకురార్పణ చేసిందని చెప్పారు.  2023–24 సంవత్సరానికి దేశ ఆర్థిక రంగం 7.6 శాతం, తెలంగాణ 7.4 శాతంగా వృద్ధిని నమోదు చేశాయని,  జాతీయ వృద్ధి రేటుకన్నా తెలంగాణ వృద్ధిరేటు తక్కువగా ఉన్నదని భట్టి తెలిపారు.  అదే సమయంలో తలసరి ఆదాయ స్థాయిల్లో జిల్లాల మధ్య తీవ్రమైన అంతరం ఉన్నదని, దీన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం విధానాలను రూపొందించి, అమలుపరుస్తుందన్నారు. 

మెట్రో రెండో దశ..శాటిలైట్ టౌన్​షిప్​ల నిర్మాణం

హైదరాబాద్​ చుట్టుపక్కల శాటిలైట్ టౌన్ షిప్ ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనేదే తమ లక్ష్యమని భట్టి తెలిపారు. ఈ టౌన్​షిప్​లలో సరసమైన ధరల్లో పేద , మధ్య తరగతి వారికి అనుకూలమైన నివాస గృహాల నిర్మాణాలను ప్రోత్సహిస్తామన్నారు.   మెట్రో మొదటి దశలో కలిగిన అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం రెండో దశ ప్రతిపాదనల నుA సమీక్షించి, వాటిని సవరించి కొత్త ప్రతిపాదనలను రూపొందించిందని చెప్పారు.  78.4  కిలోమీటర్ల పొడవున్న 5 ఎక్స్​టెండెడ్​  కారిడార్లను  రూ.24 వేల కోట్లతో అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ఇందులో భాగంగా మెట్రో రైలును పాత నగరానికి పొడిగించి.. దానిని శంషాబాద్ విమానాశ్రాయానికి కనెక్ట్​ చేస్తామని చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ట్రిపుల్​ఆర్​ ఉత్తర ప్రాంతం అభివృద్ధికి 13,522 కోట్లు, దక్షిణ ప్రాంత అభివృద్ధికి  రూ.12,980 కోట్లు ఖర్చవుతున్నదని తెలిపారు. అయితే ఈ సారి దీని కోసం బడ్జెట్ లో రూ.1,525 కోట్లు  ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు.