చేప పిల్లల విడుదల షురూ

  • 82  చెరువుల్లో.. 66.21 లక్షల పిల్లలు

మెదక్, వెలుగు: ఎట్టకేలకు చెరువుల్లో ఉచిత చేప విత్తన పిల్లల విడుదల షురూ అయింది.  జిల్లాలో 1,654 చెరువులు ఉండగా ఆలస్యం కారణంగా ఉచిత చేప విత్తన పిల్లలు 82 చెరువులకే పరిమితమయ్యాయి. కాంట్రాక్టర్లు ముందుకు రాని కారణంగా 5.20 కోట్ల టార్గెట్​ 66.21 లక్షలకు తగ్గిపోయింది. మత్స్యశాఖ అధికారులు జిల్లాల వారీగా అవసరమైన చేప విత్తన పిల్లల సరఫరా కోసం గత జూలైలో టెండర్లు పిలిచారు. కానీ మెదక్ జిల్లాలో ఒక్క టెండర్​ కూడా దాఖలు కాలేదు.

ఆ తర్వాత ఆగస్టులో రెండో సారి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. అదును దాటిపోతుండడం టెండర్ల ఖరారు ఆలస్యం కావడంతో మత్స్యశాఖ అధికారులు విత్తన  చేప పిల్లల సరఫరా టార్గెట్​ను 50 శాతం తగ్గించి 2.62 కోట్లకు కుదించారు. సెప్టెంబర్​లో  మరోసారి షార్ట్​ టెండర్లు పిలిచారు. మూడో సారి నిర్వహించిన టెండర్లలో నాలుగు దరఖాస్తులు వచ్చాయి. కానీ సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో ఒక టెండర్ రిజెక్ట్​ కాగా, మరో మూడు టెండర్లు ఖరారైనప్పటికీ మత్స్యశాఖ అధికారులు జరిపిన ఫీల్డ్ వెరిఫికేషన్​లో వారికి సంబంధించిన ఫిష్​ ఫాం లలో చేప పిల్లలు అందుబాటులో లేనట్టు గుర్తించారు.

దీంతో వారి టెండర్లను సైతం రిజెక్ట్ చేశారు. ఈ క్రమంలో మత్స్యశాఖ అధికారులు పరిస్థితి గురించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. పై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు  ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సంస్థతో చర్చించి చేప విత్తన పిల్లల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నారు. చేప పిల్లల విడుదల ఆలస్యం కావడంతో చాలా సొసైటీలు ప్రైవేట్​లో చేప విత్తన పిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో పోసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 100 ఎకరాల ఆయకట్టు కలిగిన 82 చెరువుల్లో మాత్రమే 66,21,400 ఉచిత చేప పిల్లలను వదలాలని నిర్ణయించారు. బుధవారం నుంచి నిర్దేశించిన చెరువుల్లోఉచిత చేప పిల్లల విడుదల మొదలుపెట్టారు. పది రోజుల్లోగా గుర్తించిన చెరువుల్లో చేప విత్తన పిల్లల విడుదల ప్రక్రియ పూర్తి చేస్తామని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.

మత్స్యకారులను బలోపేతం చేస్తాం

మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా సంక్షేమ పథకాలు చేపడుతున్నాం. మత్స్యశాఖ ఆధ్వర్యంలో లక్షా 13 వేల 672 చేప పిల్లలను రూ.1.80 లక్షలతో విడుదల చేశాం. రూ.5 లక్షల ప్రమాద బీమా, చేపలు అమ్ముకునేందుకు రూ.10 లక్షల విలువైన వాహనాలను 40 శాతం సబ్సిడీ తో  అందిస్తున్నాం. మెదక్​ మండలం రాయిన్​పల్లి ప్రాజెక్టులో వంద శాతం సబ్సిడీపై చేపపిల్లల విడుదల చేశాం. మత్స్యకారులకు ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటా. చేప పిల్లలను పెంచి, వాటి ద్వారా ఉపాధిని పొంది ఆర్థిక వృద్ధి సాధించాలి - ఎమ్మెల్యే రోహిత్