భార్య ప్రైవేట్ ఫోటోలు లీక్ చేస్తానని బెదిరింపులు.. భర్తపై కేసు నమోదు

హైదరాబాద్: వ్యక్తిగత ఫోటోలు బయటపెడతానని బెదిరిస్తూ భర్త తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ ఫిల్మ్ నగర్ పోలీసులకు పిర్యాదు చేసింది. డబ్బు కోసం ప్రేమ పేరుతో తనకు దగ్గరై.. బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆమె పిర్యాదులో పేర్కొంది.

అసలేంటి ఈ భార్యాభర్తల కథ..?

సోషల్ మీడియా ద్వారా యువతికి.. ఓ యువకుడు పరిచయం అయ్యాడు. రోజులు గడిచే కొద్దీ ఆ చనువు కాస్త ప్రేమకు దారితీసింది. ఆ తరువాత అందరి జంటల్లానే వీరు సినిమాలు, షికార్లు గట్రా తిరిగారు. ఆ సమయంలోనే నిందితుడు తనను పెళ్లాడితే మహారాణిలా చూసుకుంటానని నమ్మబలికాడు. అతని మాయమాటలు నమ్మిన యువతి.. యువకుడు చెప్పిన చోటకల్లా వెళ్లేది. అదే అదునుగా యువకుడు ఫోటోలు తీసి తన వద్ద ఉంచుకున్నాడు. కొన్నాళ్ల తరువాత తన దుర్బుద్ధిని బయటపెట్టాడు. డబ్బు కోసం ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. 

 కాదంటే, తన వద్ద నున్న ప్రైవేట్ ఫోటోలు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించేవాడు. ఆ భయంతో యువతి.. అతనికి దాదాపు రూ.10 లక్షల విలువైన ఆభరణాలు ఇచ్చినట్లు సమాచారం. వాటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేశాడు. అదే సమయంలో ఆమెను బలవంతంగా ఆర్యసమాజ్‌లో రహస్య వివాహం చేసుకున్నాడు.

రాను.. రాను అతని ఆగడాలు మరీ ఎక్కువ వ్వడంతో యువతి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించింది. చివరకు అతని నుంచి తప్పించుకొని యూకె(UK) వెళ్లింది. అయినప్పటికీ, అతను వదల్లేదు. డిపెండెంట్ వీసా తీసుకొని యూకే ఫ్లైట్ ఎక్కాడు. ఆ దేశంలోనూ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలు పెట్టాడు. అతని వేధింపులతో విసిపోయిన యువతి హైదరాబాద్ చేరుకొని.. ఫిల్మ్ నగర్ పోలీసులకు భర్తపై పిర్యాదు చేసింది.