
ఎవరికైనా అమ్మానాన్నల మీద కోపం వస్తే ఏం చేస్తారు? అలిగి అన్నం తినడం మానేస్తారు. లేదంటే ఇంట్లో ఉన్న వస్తువులు పగులగొడతారు. అదే సినిమాల్లో అయితే ఇంటి నుంచి వెళ్లిపోయి తర్వాత ఎప్పటికో తిరిగి వస్తారు. కానీ, ఆండ్రెస్కాంటో మాత్రం చాలా డిఫరెంట్‌గా ఒక పని చేశాడు. అది కూడా ఎనిమిదేండ్లుగా ఆపకుండా చేస్తూనే ఉన్నాడు. ఇంతకీ ఏం చేశాడు?
పద్నాలుగేండ్ల వయసులో ఆండ్రెస్ కాంటో పక్కనే పల్లెటూరికి వెళ్లడానికి ట్రాక్ సూట్వేసుకుంటానని అమ్మానాన్నని అడిగాడు. అందుకు వాళ్లు ‘నో’ అన్నారట. ఆండ్రెస్ వాళ్లతో చాలాసేపు వాదించినా వాళ్లు ససేమిరా అన్నారు. దాంతో ఆండ్రెస్ వాళ్ల తాత వాడే గడ్డ పార తీసుకుని ఇంటి వెనక ఉన్న గార్డెన్‌లోకి వెళ్లాడు. ఒకచోట మట్టిని తవ్వుతూ తన కోపాన్ని తీర్చుకున్నాడు. కానీ, అది అలా ఒక్కరోజుతో ఆగిపోలేదు. ఎనిమిదేండ్లుగా మట్టిని తవ్వడమే పనిగా పెట్టుకున్నాడు. అదేపనిగా తవ్వుతుండడంతో చిన్న రంధ్రం కాస్త పెద్ద గుహ అయిపోయింది. ఆండ్రెస్ కోపం సంగతేమో కానీ ఇప్పుడు ఆ గుహను ఇంటిగా మార్చే పనిలో పడ్డాడు. ఈ ఎనిమిదేండ్లు అందుకోసం బాగా కష్టపడ్డాడు. మొత్తానికి ఆ గుహ లోపలికి వెళ్లడానికి మెట్లతో సహా పెద్ద హాల్, బెడ్ రూమ్‌లు ఏర్పాటు చేశాడు. అంతేనా, బొగ్గు పొయ్యి, స్పీకర్స్, వైఫై, ఫోన్ సాకెట్స్, ఫ్రూట్ బాస్కెట్స్, కోక్ టిన్స్ వంటివి కూడా ఉన్నాయి. ఇంతటితో ఆగిపోయాడా... అంటే లేదు. ఇప్పటికీ ఆండ్రెస్ తవ్వడం ఆపడం లేదు. ఇంకా ఎందుకు తవ్వుతున్నావు? అనడిగితే..ఇప్పుడున్న ఇంటికి కొంచెం దగ్గర్లో కొత్త గది కట్టాలి అనుకుంటున్నా అన్నాడు. పార పట్టుకుని తవ్వడం మొదలుపెట్టిన రోజున నాకేం తెలియదు. గడ్డపారతో తవ్వి, చేత్తో మట్టి తీసేవాడు. ఆ తర్వాత ఎప్పటికో నుమాటిక్ డ్రిల్ కొని దాంతో వారానికి14 గంటలు తవ్వి బకెట్‌తో మట్టి తీయడం మొదలుపెట్టాడు. ఆండ్రెస్ చేసిన ఈ పనికి వాళ్ల అమ్మానాన్న కూడా ఏమనలేకపోయారు. ఈ ఇంటిని ఆఫీసర్స్ చెక్ చేసి బేస్మెంట్, స్టోరేజ్ నిర్మాణం లాంటివి ఏం లేకపోవడంతో లీగల్ ఇష్యూలు లేవని చెప్పారు. అలా మనోడు అమ్మానాన్నల మీద కోపంతో ఏకంగా ఒక ఇల్లు కట్టేశాడన్నమాట.
ప్రస్తుతం 22 ఏండ్ల ఆండ్రెస్ కాంటో, ముర్షియాలో ఉంటున్నాడు. అక్కడే సుపీరియర్ స్కూల్ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్‌లో యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. అయినా కూడా వీకెండ్స్‌లో కొంత టైం ఈ ప్రాజెక్ట్ వర్క్ మీద స్పెండ్ చేస్తున్నాడు. ‘కరోనా ప్యాండెమిక్ టైంలో చాలాసేపు గుహను తవ్వుతూ ఉండేవాడిని. కానీ, ఇప్పుడు గుహలో తక్కువ టైం ఉంటున్నా. వారంలో నాలుగ్గంటలే గుహను తవ్వుతున్నా’ అంటున్నాడు.