భూమి కోసం కొట్లాట.. ఇరువర్గాల దాడిలో 6 మంది మృతి

భూమి కోసం కొట్లాట..  ఇరువర్గాల దాడిలో 6 మంది మృతి

మధ్యప్రదేశ్​లోని మొరెనా జిల్లాలో భూ వివాదం హింసకు దారి తీసింది. ఈ ఘటనలో ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూవివాదం కారణంగా డీర్​సింగ్, గజేంద్ర సింగ్​ కుటుంబాలు తరచూ గొడవలు పడుతున్నాయి. 2013లో ధీర్​సింగ్​ కుటుంబానికి చెందిన ఇద్దరు హత్యకు గురికాగా, గజేంద్ర సింగ్​ కుటుంబంపై హత్యారోపణలు వచ్చాయి. అనంతరం రెండు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందం తరువాత గజేంద్ర సింగ్​ కుటుంబం కూడా అదే గ్రామంలో స్థిరపడింది. 
చెలరేగిన ఘర్షణ..
ఈ క్రమంలో ధీర్​సింగ్​, గజేంద్ర సింగ్​లకు చెందిన గ్రూపుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఇరువురు కర్రలతో దాడి చేసుకున్నారు. ధీర్​ సింగ్​ మద్దతుదారులు ప్రత్యర్థులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, అయిదుగురు గాయపడ్డారు. ఇందులో మహిళలు సైతం ఉన్నారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణం విడిచారు. హత్యకు పాల్పడిన ఎనిమిది మందిని గుర్తించి, వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.