ప్రైవేట్ హాస్పిటల్స్ డెంగ్యూ కేసుల లెక్కలేవి?

  • ర్యాపిడ్ టెస్టులతోనే డెంగ్యూ నిర్ధారిస్తున్న వైనం
  • వైద్యారోగ్యశాఖకు కేసుల రిపోర్టులు పంపని హాస్పిటల్స్
  • జ్వరాలను క్యాష్ చేసుకుంటున్న యాజమాన్యాలు
  • వివరాలు పంపాలని కలెక్టర్ ఆదేశాలు
  • జిల్లా వ్యాప్తంగా నమోదైన 63 కేసులన్నీ సర్కార్ దవాఖానాల్లోనే.

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జ్వరాల బాధితులు పెరిగిపోతున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో డెంగ్యూ, విష జ్వరాల కేసుల వివరాలు నమోదు చేస్తుండగా,  ప్రైవేట్ హాస్పిటళ్లలో మాత్రం వీటి లెక్కలు చూపడం లేదు. జిల్లాలో రిమ్స్ మినహా డెంగ్యూ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు ఎక్కడా లేవు. ప్రభుత్వ హాస్పిటల్స్​కు వచ్చే రోగుల శాంపుల్స్​ను రిమ్స్​లో నిర్ధారణ చేసి రిపోర్టులు ఇస్తున్నారు. 

ఇవి అధికారికంగా వైద్యారోగ్యశాఖ రికార్డుల్లో నమోదవుతున్నాయి. కానీ ప్రైవేట్​లో నమోదవుతున్న డెంగ్యూ కేసుల వివరాలు మాత్రం చెప్పడం లేదు. ఇప్పటివరకు జిల్లాలో నమోదైన మొత్తం 63 డెంగ్యూ కేసులు ప్రభుత్వ దవాఖానాల్లోనివే. ప్రైవేట్​లో నిర్ధారణ అవుతున్న కేసులను మాత్రం బయటపెట్టకపోవడంతో వైద్యారోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

రిపోర్ట్ ​పంపని హాస్పిటల్స్​

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వందకు పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో చాలా మంది జ్వరాలతో హాస్పిటల్స్​కు పరుగులు తీస్తున్నారు. ఇదే అదునుగా భావించి టెస్టుల పేరుతో భారీగా దండుకుంటున్నారు. జ్వరం ఉంటే చాలు రెండు, మూడు రోజులు అడ్మిట్ చేసుకొని మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ టెస్టులు చేసేస్తు న్నారు. ప్లేట్​లేట్స్ పడిపోయాయని, డెంగ్యూ ఉందంటూ భయపెట్టేస్తున్నారు. అడ్మిట్ చేసుకొని డిశ్చార్జ్ అయ్యే వరకు భారీగా బిల్లులు వేస్తున్నారు. 

అసలు ప్రైవేట్ లో డెంగ్యూ నిర్ధారణ చేసేందుకు అనుమతులు లేనప్పటికీ.. పేషెంట్​కు అవసర మున్నా, లేకున్నా ర్యాపిట్ టెస్టులు చేస్తూ నిర్ధారిస్తున్నారు. ప్రైవేట్, గర్నమెంట్ హాస్పిటల్స్ లో ట్రీట్​మెంట్​తీసుకుంటున్న పేషంట్లకు డెంగ్యూ నిర్ధారించాలంటే జిల్లా కేంద్రంలోని రిమ్స్​కు శాంపుల్స్ పంపించాలి. అక్కడ టెస్టు చేసి రిపోర్ట్​ ఇస్తేనే అది కచ్చితమైనదిగా చెప్పవచ్చు. రిమ్స్​లో యాంటిజెనిక్ ఎలిసా టెస్ట్ ద్వారానే డెంగ్యూ నిర్ధారిస్తున్నారు. ఈ టెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్​ హోమ్​లలో ఎక్కడా లేదు. 

కానీ కేవలం ర్యాపిడ్ కిట్ల ద్వారా డెంగ్యూగా తేల్చేస్తు న్నారు. నిర్ధారించిన కేసుల వివరాలను మాత్రం వైద్య ఆరోగ్యశాఖకు పంపడంలేదు. కొన్ని హాస్పిటల్స్​లో పేషంట్లకు కూడా ఆ రిపోర్టులు ఇవ్వడం లేదు.  దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్​లో నమోదయ్యే డెంగ్యూ కేసులు ఏ ప్రాంతాల వారివో తెలియకపోవడంతో ఆయా ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం కావడం లేదు.  

కలెక్టర్ హెచ్చరికలు డెంగ్యూ నిర్ధారిస్తూ రిపోర్డులు పంపని ప్రైవేట్ హాస్పిటల్స్​ను కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. డెంగ్యూ కేసుల వివరాలు నమోదు చేసి రిపోర్ట్ సమర్పించా లని ఆదేశాలు జారీ చేశారు. రోగులకు డెంగ్యూ ర్యాపిడ్ టెస్ట్ చేసినా పరీక్షలో నిర్ధారణ అయితేనే పాజిటివ్‌గా పరిగణించాలని సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్స్​లో రోగుల వద్ద అదనపు బిల్లులు వసూలు చేయడం పట్ల కలెక్టర్ సీరియస్​గా ఉన్నారు. త్వరలో ప్రైవేట్ హాస్పిటల్స్​ను తనిఖీ చేయనున్నట్లు సమాచారం. 

ఎలిసా టెస్టు ద్వారానే నిర్ధారించాలిఎలిసా టెస్టు ద్వారా డెంగ్యూను నిర్ధారించాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ డెంగ్యూ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకుంటాం. త్వరలో అన్ని హాస్పిటల్స్ తనిఖీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అనవసరంగా రోగులకు వైద్య పరీక్షలు చేస్తూ అధిక బిల్లులు వేయడం మానుకోవాలి. డెంగ్యూ కేసుల వివరాలు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎప్పటికప్పుడు పంపించాలి.

 కృష్ణారావు, డీఎంహెచ్​ఓ, ఆదిలాబాద్