ఎరువుల అమ్మకాలలో ఇష్టారాజ్యం

  •     ఎక్కువ ధరకు అమ్ముతున్న ఫర్టిలైజర్​ షాప్ ​యజమానులు
  •     సిండికేట్​గా మారి మోసగిస్తున్నారని రైతుల ఆరోపణ
  •     పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు

కౌడిపల్లి, వెలుగు : కౌడిపల్లి మండలంలోని ఫర్టిలైజర్ షాపు యజమానులు నిబంధనలకు విరుద్ధంగా ఎరువులను ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఫర్టిలైజర్ షాప్ ల యజమానులు సిండికేట్ గా మారి మోసగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఉద్దేశ్య పూర్వకంగా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా బస్తా రూ.265 విక్రయించాల్సి ఉండగా షార్టేజీ ఉందని చెబుతూ రూ. 290  అమ్ముతున్నారని, మరో షాప్​లో  రూ.300 వసూలు చేస్తూ బస్తాకు రూ.35 అదనంగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.

వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో వరినాట్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రైతులు ఎరువుల కొనుగోలు కోసం ఫర్టిలైజర్​షాప్​లకు వెళ్తుండడంతో ఇదే అదనుగా వ్యాపారులు ధర పెంచి అమ్ముతున్నారు. షాప్​ల వద్ద స్టాక్ బోర్డులో ఎరువుల ధరల పట్టికను ఏర్పాటు చేయాల్సి ఉన్న కౌడిపల్లితో పాటు ఇతర గ్రామాల్లో  ఫర్టిలైజర్ డీలర్లు స్టాక్ బోర్డులు పెట్టడంలేదు. కొన్నిచోట్ల స్టాక్ బోర్డులు పెట్టినప్పటికీ దాంట్లో ధరలు వేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్న డీలర్లు బిల్ పై ఒక రేటు వేస్తూ, దాని వెనకాల మరో రేటు వేస్తున్నారు. అప్పులు చేసి పంటలు సాగు చేస్తుండగా ఫర్టిలైజర్ షాపు యజమానులు తమను దోచుకోవడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. డీలర్లు నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. 

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు

అధిక ధరలకు ఎరువులు విక్రయించిన షాపులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే ఎరువులు విక్రయించాలి. యూరియా పేరుతో ఇతర లేనిపోని ఎరువులు రైతులకు అంటగడితే షాపుల లైసెన్స్​లు క్యాన్సిల్​చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. 

 - ఏడీఏ పుణ్యవతి, కౌడిపల్లి

రాసిన బిల్లు కంటే ఎక్కువ తీసుకుంటున్రు 

స్లిప్పులో రాసిన బిల్లు కంటే బస్తాకు రూ.25  ఎక్కువ తీసుకున్నారు. స్లిప్పులో యూరియా బస్తాకు రూ.265 వేసి స్లిప్పు వెనకాల బస్తాకు రూ.290 రూపాయలు వేసి ఇస్తున్నరు. ఇదేంటి అని అడిగితే అది అంతే ఉంటదని తీసుకుంటే తీసుకో లేదంటే లేదని బెదిరిస్తున్నారు.

- అంబుర్య నాయక్,  రైతు, రాజిపేట్ 

ఒరిజినల్​బిల్లు ఇస్తలేరు 

ఫర్టిలైజర్​షాప్​లో ఎరువులు కొంటే ఒరిజినల్​ బిల్లు ఇస్తలేరు. డుప్లికేట్​బిల్లు మీద ఎక్కువ బిల్లు రాసి ఇచ్చారు. ఇదేంటని అడిగితే అంతే అన్నారు. మూడు యూరియా బస్తాలు తీసుకుంటే రూ.900 తీసుకున్నారు. బస్తాకు రూ.265 తీసుకోవాల్సి ఉంటే ఒక్కో బస్తాకు రూ.35 చొప్పున మూడు బస్తాలకు కలిపి రూ.105 ఎక్కువగా తీసుకున్నారు.‌‌‌‌ - 

- కేతావత్ జవహర్ నాయక్, రైతు, బిట్ల తండా