రెండు వారాలుగా అక్కడే.. ఆడ పులి మకాం! మంచిర్యాల జిల్లాలో టెన్షన్ టెన్షన్

 

  • మంచిర్యాల సమీపంలోని క్వారీ ఫారెస్టులోనే సంచారం 
  • 15 రోజులుగా ర్యాలీ గుట్టలు, గాంధారి ఖిలాలో కదలికలు
  • ఆహారం, ఆవాసం అనుకూలంగా ఉండడమేనంటున్న ఆఫీసర్లు
  • అడవిలో అలికిడి లేకుండా, పశువులు వెళ్లకుండా తగు చర్యలు
  • నెలన్నర కింద అదే ఏరియాలో కనిపించిన మగ పులి  

మంచిర్యాల, వెలుగు:   ఆసిఫాబాద్ ​జిల్లా కెరమెరి వైపు నుంచి వచ్చిన ఆడ పులి మంచిర్యాల సమీప అడవుల్లో మకాం వేసింది. 15 రోజులుగా లక్సెట్టిపేట రేంజ్​పరిధిలోని పాత మంచిర్యాల, హాజీపూర్, గఢ్​పూర్, మేడారం సెక్షన్ల పరిధిలో తిరుగుతోంది. అది గత డిసెంబర్19న గాంధారి ఖిలా మీదుగా పాత మంచిర్యాల సెక్షన్​లోకి ప్రవేశించింది. అక్కడి క్వారీ సఫారీ ఏరియా నుంచి ముల్కల్ల వైపు వెళ్లింది.

అంతకు ముందు రోజు ఫారెస్టులో సీసీ కెమెరాలకు చిక్కింది. ప్రస్తుతం ర్యాలీవాగు ప్రాజెక్టు పరిసరాల్లోని గుట్టల్లో తిరుగుతోంది. ఎప్పటికప్పుడు ఫారెస్ట్ ​ఆఫీసర్లు సీసీ కెమెరాలు, పాదముద్రల ద్వారా టైగర్​మూమెంట్​ను ట్రాకింగ్ ​చేస్తున్నారు. దానికి ఎలాంటి ఆపద రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఆహారం, ఆవాసం దొరకడమేనా ?

మంచిర్యాల జిల్లా కేంద్రానికి 10 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలోనే మగపులి కదలిక కనిపిస్తోంది. గాంధారి ఖిలా, ముల్కల్ల, హాజీపూర్, ర్యాలీ, గఢ్​పూర్ ప్రాంతాల మధ్యలో సంచరిస్తోంది. ఆ ప్రాంతమంతా దట్టమైన అడవులు, గుట్టలతో విస్తరించి ఉంది. జింకలు, దుప్పులు, అడవి పందులు, కుందేళ్లు వంటి శాకాహార జంతువులు, చిరుతలు, ఎలుగుబంట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

ర్యాలీవాగు ప్రాజెక్టుతో పాటు అడవిలో వాగులు, కుంటలు, నీటి వనరులు కూడా ఉన్నాయి. దీంతో అక్కడ పెద్దపులికి సరిపడా ఆహారం దొరకడమే కాకుండా ఆవాసం సైతం అనుకూలంగా ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అడవిలో అలికిడి అయితే పులి ఇబ్బందులకు గురయ్యే చాన్స్ ఉండడంతో అటువైపు పశువులు పోకుండా చర్యలు తీసుకుంటున్నారు. పులి కదలికలపై స్థానిక గ్రామాల ప్రజలను, పశువుల కాపరులను అలర్ట్ ​చేశామని లక్సెట్టిపేట రేంజ్​ఆఫీసర్ ​సుభాశ్ ​చెప్పారు. 

గత నవంబర్​లో  వచ్చిన మగ పులి  

గత నవంబర్​లో అదే ఏరియాలో ఎస్​-12  మగ పులి కనిపించింది. ఆసిఫా బాద్, తిర్యాణి ప్రాంతాల మీదుగా కవ్వాల్​టైగర్​ జోన్​లోకి వెళ్లింది. లక్సెట్టిపేట, బెల్లంపల్లి, కాసిపేట, మందమర్రి రేంజ్​అడవుల్లోనూ తిరిగింది. హాజీపూర్​మండలం బుగ్గగుట్ట సమీపంలో మామిడి తోటలో గొర్రెల మందపైదాడి చేసింది. ఆ తర్వాత కాసిపేట మండలం ముత్యంపల్లి సెక్షన్​లో పశువులను చంపింది. సాధార ణంగా చలికాలం టైగర్​ మేటింగ్​ సీజన్​ కావడంతో మగ, ఆడ పులి రెండూ తోడును వెతుక్కుంటూ వచ్చినట్టు భావి స్తున్నారు. కానీ, ఆడ పులి  వచ్చేటప్పటికే మగ పులి వెళ్లిపోవడంతో మేటింగ్ అయ్యే చాన్స్​ లేకుండాపోయింది.