ఏనుగు మృతికి కారణం లైంగిక దాడి

ఏనుగు మృతికి కారణం లైంగిక దాడి

చిత్తూరు:  ఒక మగ ఏనుగు జరిపిన లైంగిక దాడిలో ఓ ఆడ ఏనుగు మృతి చెందింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో జరిగింది. ముందుగా అనారోగ్యం కారణంగా మృతి చెందిందని భావించిన అటవీశాఖాధికారులు పోస్టుమార్టం అనంతరం ఈ విషయాన్ని నిర్ధరించారు. మండలంలోని మండిపేట కోటూరు అటవీ బీట్‌ పరిధిలోని చెత్తపెంట అటవీ ప్రాంతంలో ఒక ఏనుగు మృతదేహాన్ని కొందరు పశువుల కాపరులు గుర్తించారు. అనారోగ్యంతో రెండు రోజుల కిందట ఆ ఏనుగు మృతి చెంది ఉండవచ్చని వారు మొదట భావించారు. అదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు.

దీనిపై చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జి డీఎఫ్‌ఓ శ్రీనివాసులు, పలమనేరు ఎఫ్‌ఆర్‌ఓ మదన్‌మోహన్‌రెడ్డితో కలిసి ఆ ఏనుగు మృతదేహాన్ని పరిశీలించి ఇతర వివరాలపై ఆరా తీశారు. మృతి చెందిన ఏనుగుతో పాటు మరో పిల్ల ఏనుగు అక్కడే ఉండేదని అది ఎక్కడికి వెళ్లిందో తెలియలేదని వాచర్లు తెలిపారు. సోమవారం రాత్రి ఆడ ఏనుగు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. అది లైంగిక దాడికి గురై మృతి చెందినట్లు తేలిందని అటవీశాఖాధికారులు వెల్లడించారు.