- ఫైనాన్స్ కంపెనీ పేరిట జనం నుంచి రూ.50 కోట్లు వసూలు
- అవి తిరిగి చెల్లించలేక సూసైడ్.. రంగారెడ్డి జిల్లా టంగుటూరులో దారుణం
శంకర్ పల్లి, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శంకర్పల్లి మండలం టంగుటూరులో ఓ తండ్రి తన ముగ్గురు కొడుకులను చంపేశాడు. అనంతరం తానూ ఓ చెట్టుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. టంగుటూరు గ్రామానికి చెందిన రవి కుమార్(35)కు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. రవి రెండేండ్లుగా ఏపీకి చెందిన జీఎస్ఎన్ అనే ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
మనీ స్కీమ్ కు కోఆర్డినేటర్‌గా ఉంటూ ఒకింత డబ్బు కడితే ఐదింతలు రిటర్న్స్వస్తాయని టంగుటూరుతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో జనాల్ని నమ్మించాడు. ఏడాది వరకు అందరికీ తిరిగి డబ్బులు చెల్లించాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. ఫైనాన్స్ కంపెనీ నుంచి డబ్బులు రాకపోవడం, వసూలు చేసిన మొత్తంలో కొంత సొంత ఖర్చులకు వాడుకోవడం, ఇలా పలు కారణాలతో కస్టమర్ల నుంచి తప్పించుకు తిరగడం ప్రారంభించాడు.
అర్ధరాత్రి ఉరేసి..
ఆరు నెలలుగా డబ్బు కట్టిన వారి నుంచి రవి కుమార్ పై ఒత్తిడి పెరిగింది. దాంతో అతను తన ఫ్యామిలీని శంకర్‌పల్లికి షిఫ్ట్చేశాడు. ఆదివారం భార్యని పుట్టింటికి పంపించాడు. తన చిన్న కొడుకు ఉదయ్‌కిరణ్(5)ను తన వద్దే ఉంచుకున్నాడు. మధ్యాహ్నం టైంలో చిలుకూరులో చదువుతున్న తన ఇద్దరు కొడుకులు సాయి కిరణ్(6వ తరగతి), మోహిత్ కుమార్(5వ తరగతి)ను టంగుటూరుకి తీసుకొచ్చాడు.
ముగ్గురు పిల్లలు పడుకున్నాక అర్ధరాత్రి తాడుతో వారికి ఉరివేసి చంపాడు. అనంతరం ఊరి చివరన ఉన్న తన పొలం వద్దకు వెళ్లి తాను కూడా ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటన స్థలాన్ని నార్సింగి ఏసీపీ రమణగౌడ్, మోకిల, శంకర్పల్లి సీఐలు, ఎస్సైలు పరిశీలించారు. మృతుడు రవికుమార్ టంగుటూరుతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని జనం నుంచి రూ.50 కోట్లు వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్క టంగుటూరులోనే రూ.కోటి వసూలు చేశాడని గ్రామస్తులు చెబుతున్నారు.
