దేశ రాజధానిలో దారుణం.. నలుగురు కూతుర్లను చంపి తండ్రి ఆత్మహత్య

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. నలుగురు కూతుర్లను హత్య చేసి అనంతరం తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  నైరుతి ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ రంగపురిలో హీరాలాల్ అనే వ్యక్తి తన నలుగురు కూతుర్లతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. గతేడాది భార్య క్యాన్సర్‎తో మరణించడం.. కూతుర్లు అనారోగ్యం పాలు కావడంతో హీరాలాల్ డిఫ్రెషన్‎లోకి వెళ్లాడు. 

ఉద్యోగం కూడా మానేసి ఇంట్లోనే ఉండటంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన హీరాలాల్ అద్దెకు ఉంటున్న ఇంట్లోనే నలుగురు కూతుర్లను హత్య చేసి.. అనంతరం అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగు రోజులుగా ఇంట్లో నుండి ఎవరూ బయటకు రాకపోవడం, దుర్వాసన రావడంతో హీరాలాల్ ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించాడు. 

ALSO READ | తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం... బాణాసంచా గోడౌన్ లో చెలరేగిన మంటలు....

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హీరాలాల్ ఇంటి తలుపు బద్దలు కొట్టి వెళ్లగా చూడగా.. ఫ్లాట్‌లో ఉన్న రెండు గదుల్లో  మొదటి రూమ్‏లో ఒక వ్యక్తి శవమై కనిపించగా, మరో గదిలో నలుగురు మహిళలు మృతదేహాలు కనిపించాయని తెలిపారు. మృతులను హీరాలాల్ శర్మ (46), అతని నలుగురు కుమార్తెలు నీతు (26 ) నిక్కి (24), నీరు (23), నిధి (20)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి కారణంగా హీరాలాల్ ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు పోలీసులకు వెల్లడించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.