పుట్టింటికి వెళ్లిన భార్యను రప్పించేందుకు..కొడుకుపై బ్లేడ్‌‌‌‌తో దాడి

  • మెడ, చేతులపై కోసిన తండ్రి
  • వికారాబాద్ జిల్లా కరన్‌‌‌‌కోట్‌‌‌‌ పీఎస్‌‌‌‌ పరిధిలో ఘటన

వికారాబాద్, వెలుగు : కొడుకుని చంపితే పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి వస్తుందన్న ఆలోచనతో ఓ వ్యక్తి బ్లేడ్‌‌‌‌తో కొడుకుపై దాడి చేశాడు. ఈ ఘటన వికారాబాద్‌‌‌‌ జిల్లా కరన్‌‌‌‌కోట్‌‌‌‌ పీఎస్‌‌‌‌ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. కరణ్‌‌‌‌కోట్‌‌‌‌ ఎస్సై విఠల్‌‌‌‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వికారాబాద్‌‌‌‌ జిల్లా తాండూర్‌‌‌‌ మండలంలోని మల్కాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన హనుమంతు, లక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు. మద్యానికి అలవాటు పడిన హనుమంతు నిత్యం భార్యతో గొడవపడి ఆమెను కొట్టేవాడు. దీంతో లక్ష్మి ఇద్దరు కొడుకులను తీసుకొని మూడు నెలల కింద పుట్టింటికి వెళ్లింది.

ఎనిమిదో తరగతి చదువుతున్న పెద్ద కొడుకు అరవింద్‌‌‌‌ తండ్రి వద్దే ఉండిపోయాడు. హనుమంతు ఆదివారం రాత్రి బ్లేడ్‌‌‌‌తో అరవింద్‌‌‌‌పై దాడి చేశాడు. ‘నిన్ను చంపితే కానీ మీ అమ్మ లక్ష్మి రాదు’ అంటూ అరవింద్‌‌‌‌ చేతులు, మెడపైన బ్లేడ్‌‌‌‌తో కోశాడు. అరవింగ్‌‌‌‌ పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతడిని రక్షించారు. అరవింద్‌‌‌‌ మామ అశోక్‌‌‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై విఠల్‌‌‌‌రెడ్డి తెలిపారు.