గుజరాత్‎లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి

గుజరాత్‎లోని సురేంద్ర నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్ ట్రక్కును ఢీకొనడంతో నలుగురు మహిళలు మృతి చెందగా..  మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ ఇంఛార్జి ఐబి వాల్వి మాట్లాడుతూ.. చోటిలా ప్రాంతంలో సోమవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 20 మంది ప్రయాణిస్తు్న్నారని.. వారంతా ఏదో మతపరమైన కార్యక్రమం కోసం సోమనాథ్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుందన్నారు. సురేంద్రనగర్‌లోని లింబ్డి తాలూకాలోని షియాని గ్రామం నుంచి సోమనాథ్‌కు బయలుదేరిన వ్యాన్.. చోటిలా ప్రాంతానికి రాగానే ఎదురుగా వస్తోన్న లారీని ఢీకొట్టిందని చెప్పారు.

ALSO READ | Google Map: గూగుల్ మ్యాప్స్పై కేసు

సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాజ్ కోట్ సివిల్ ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు స్పాట్‎లోనే చనిపోగా.. మరో ఇద్దరు లేడీస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. మృతులను మగ్జిబెన్ రెథారియా (72), గలాల్‌బెన్ రెథారియా (60), మంజుబెన్ రెథారియా (65), గౌరీబెన్ రెథారియా (68)గా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.