ఛత్తీస్‎గఢ్‎లో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఆరుగురు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‎ లో వచ్చిన లారీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దొండి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భానుప్రతాప్‌పూర్‌-దల్లిరాజహార రహదారిపై చౌరపవాడ్‌ సమీపంలో 2024, డిసెంబర్ 16 సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజ్‌నంద్‌గావ్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ఘటనపై బలోద్ ఏఎస్పీ అశోక్ జోషి మాట్లాడుతూ.. రాంగ్ రూట్‎లో వచ్చిన ట్రక్ కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. లారీ డ్రైవర్ సంఘటనా స్థలం నుండి పారిపోయాడని.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. 

ప్రమాదంలో కారు ముందు భాగంగా నుజ్జునుజ్జు కావడంతో తీవ్రంగా శ్రమించి కారులో చిక్కుకున్నవారిని బయటకు తీశామన్నారు. ప్రమాదానికి గురైన వారు దుండిలోని కుంభాకర్‌లో బంధువుల ఇంట్లో జరిగిన ఛత్తీ పూజ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా.. ఈ ఘటనలో జరిగిందని పేర్కొన్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.