కేంద్ర రవాణా శాఖ ఆదేశాలు
రాష్ట్రంలో 21 టోల్ ప్లాజాలు
ఇంకా ఫాస్టాగ్ లేని వెహికల్స్ లక్షల్లోనే
ప్రతి టోల్ ప్లాజా దగ్గర ఫాస్టాగ్ విక్రయ కేంద్రాలు
హైదరాబాద్, వెలుగు: హైవేలపై జర్నీ చేస్తున్న వెహికల్స్‌కు జనవరి 1 నుంచి ఫాస్టాగ్ మస్ట్ కానుంది. ఇప్పటివరకు టోల్గేట్ల వద్ద ఉన్న క్యాష్ టోల్ రూట్లను తొలగించి.. కచ్చితంగా ఫాస్టాగ్ అమలు చేయనున్నారు. ఫాస్టాగ్ లేకుంటే టోల్గేట్ దాటలేరని.. లేనివాళ్లు టోల్గేట్ల వద్ద ఫాస్టాగ్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హైవేలపై ఉన్న 21 టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ అమలు కానుంది.
ఫాస్టాగ్ లేని వెహికల్స్ ఇంకా ఉన్నయ్
కొన్నేళ్ల కిందటే ఫాస్టాగ్ విధానం అందుబాటులోకి వచ్చినా పూర్తి స్థాయిలో వెహికల్స్‌కు తీసుకోలేదు. తగిన ప్రచారం లేకపోవడం, వెహికల్ ఓనర్లు, డ్రైవర్లలో అవగాహన లేకపోవడం, ఎప్పుడో ఒకసారి తప్ప హైవేలపైకి రానివాళ్ల సంఖ్య భారీగానే ఉండటంతో ఫాస్టాగ్ లేని వెహికల్స్ ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇకముందు తప్పనిసరి చేస్తుండటంతో అన్ని వెహకల్స్కు ఫాస్టాగ్ తీసుకుంటారని పేర్కొంటున్నారు.
కిలోమీటర్ల కొద్దీ వెహికల్స్ జామ్
నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు క్యాష్ చెల్లించే వెహికల్స్ బారులు తీరాల్సి వస్తోంది. ముఖ్యంగా పొద్దున ఎనిమిది నుంచి 11 గంటల వరకు, రాత్రి ఏడు గంటల నుంచి అర్ధరాత్రి వరకు టోల్ ప్లాజా దాటడానికి కనీసం పది నిమిషాల నుంచి అరగంట పడుతోంది. పండుగల టైంలో అయితే గంటా రెండు గంటలు కూడా ఆగాల్సి వస్తోంది. క్యాష్ రూపంలో చెల్లింపు, వెహికల్స్‌లో వెళ్లేవారిదగ్గర తగిన చిల్లర లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని అధికారులు చెప్తున్నారు. అదే ఫాస్టాగ్ అమలుతో వేగంగా వెహికల్స్ కదులుతాయని, ట్రాఫిక్సమస్య ఉండదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం పండుగలు, శని, ఆదివారాల్లో టోల్ గేట్ల దగ్గర పోలీసులు సెక్యూరిటీగా ఉంచి ట్రాఫిక్ ను క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక ఓ టోల్‌ప్లాజా దాటిన వెహికల్ గంటలోపే తిరిగి వస్తే.. పూర్తి ఫీజు కాకుండా రూల్స్ ప్రకారం కట్టాల్సిన మొత్తాన్నే ఆటోమేటిగ్గా తీసుకునేలా ఫాస్టాగ్‌లో ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇక టోల్‌ప్లాజాల సమీపంలో ఉండే గ్రామాల వెహికల్స్‌కు తక్కువ ఫీజుతో నెలవారీ పాసులు జారీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.
ఫాస్టాగ్ ఇట్లా?
ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ‘మై ఫాస్టాగ్, ఫాస్టాగ్ పార్టనర్’ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. వెహికల్ ఓనర్లు, డ్రైవర్లు తమ బ్యాంకు ఖాతాతో ఈ యాప్‌ను లింక్ చేసుకుని, కొంత సొమ్మును ఎంపిక చేసిన బ్యాంకులు, టోల్ ప్లాజాల్లో చెల్లిస్తే బార్‌కోడ్‌తో కూడిన ‘ఫాస్టాగ్’ స్టిక్కర్ ఇస్తారు. దానిని వెహికల్ ముందు భాగంలో అద్దంపై అతికించాలి. వెహికల్ టోల్ ప్లాజాలోకి ఎంటర్ అయినప్పుడు ‘ఫాస్టాగ్ బార్ కోడ్’ను ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) కెమెరాలు స్కాన్ చేస్తాయి. గేటు ఆటోమేటిగ్గా తెరుచుకుంటుంది. ఫాస్టాగ్ నుంచి ఫీజు కట్ అవుతుంది. వెహికల్ వెళ్లిపోవచ్చు. టైం ఆదా అవుతుందని, చిల్లర సమస్య వుండదని టోల్‌ప్లాజాల స్టాఫ్ చెప్తున్నారు
రాష్ట్రంలో టోల్ ప్లాజాలివే..
హైవేలపై 21 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. అవి.. మనోహరాబాద్, ఇందల్వాయి, రోల్ మమడ, పిప్పరవాడ, గంజాల్, భిక్నూర్, దిలావర్పూర్, పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు, రాయికల్, షకాపూర్, పుల్లూర్, కడ్తాల్, కోనేటిపురం, గూడూర్, ముత్తోజిపేట, కోమల్ల, కోమటిపల్లి, చింతపల్లి, గౌరారం.
క్యాష్ గేట్లు ఉండవు
‘‘జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 21 టోల్ ప్లాజాల దగ్గర కచ్చితంగా ఫాస్టాగ్‌ను అమలు చేస్తున్నం. ఇప్పటివరకు ఒక్కో టోల్ ప్లాజా దగ్గర ఒకట్రెండు క్యాష్ టోల్ వేలు ఉన్నాయి. ఒకటో తేదీ నుంచి అన్ని దారులను ఫాస్టాగ్ చేయనున్నాం. ఫాస్టాగ్ లేకపోతే వెహికల్ టోల్ గేట్ దాటలేదు. అన్ని టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్‌లు అమ్మడానికి రెండు వైపులా 8 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నం. రాష్ట్రంలో 80శాతం వెహికల్స్‌కు ఫాస్టాగ్ లు ఉన్నయ్’’
– కృష్ణప్రసాద్, రీజనల్ ఆఫీసర్,ఎన్ హెచ్ఏఐ, తెలంగాణ రీజియన్
నాలుగేండ్ల కింద మొదలై..
కేంద్రం 2016లో తొలిసారిగా ఫాస్టాగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 2017 డిసెంబర్ 1 నుంచి ఫోర్ వీలర్ల రిజిస్ట్రేషన్స్ కు ఫాస్టాగ్ మస్ట్ అని తెలిపింది. మెల్లగా ఫాస్టాగ్ వినియోగాన్ని పెంచుతూ.. క్యాష్ టోల్గేట్ల సంఖ్యను తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతం ప్రతి టోల్గేట్ వద్ద ఒకట్రెండు క్యాష్టోల్ రూట్లు మాత్రమే ఉన్నాయి. వాటిని కూడా జనవరి ఒకటి నుంచి తొలగించనున్నారు. ఫాస్టాగ్ లేని వెహికల్స్కోసం.. ప్రతి టోల్ ప్లాజా దగ్గర వాటిని అమ్ముతున్నారు. ఎన్ హెచ్ఏఐ, ఎయిర్ టెల్, పలు బ్యాంకుల ప్రతినిధులు రెండు వైపులా సెంటర్లు పెట్టి విక్రయిస్తున్నారు. ఉదయం ఎక్కువ మంది ఫాస్టాగ్ కొంటున్నారని చెప్తున్నారు.
