‘మన్ కీ బాత్’ టైంలో కంచాలు మోగించిన రైతులు
కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు
సింఘు బార్డర్ కు వెళ్లిన కేజ్రీవాల్
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా 32వ రోజు నిరసనలు
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీ బార్డర్ లో రైతులు ఆందోళనను తీవ్రతరం చేశారు. ఆదివారం ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రోగ్రామ్ ప్రసారం అవుతున్న సమయంలో రైతులు కంచాలు, పాత్రలు మోగించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంజాబ్ లోని అమృత్ సర్, ఫిరోజ్ పుర్, సంగ్రుర్, తల్వండి సబో, భటిండా, తార్న్ తరన్ జిల్లాల్లో.. హర్యానాలోని రోహ్తక్, జిండ్ జిల్లాల్లో పలు చోట్ల రైతులు కంచాలు మోగించి నిరసన తెలిపారు.
‘మీ మన్ కీ బాత్ విని అలసిపోయాం. మా మన్ కీ బాత్ ఎప్పుడు వింటారు’ అని ప్రశ్నిస్తూ స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ వారం క్రితమే ‘థాలీ బజావో (కంచాలు మోగించండి)’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రైతుల ఆందోళనకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. ఆదివారం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి ఆయన సింఘు బార్డర్ కు వెళ్లి ఆందోళనలో పాల్గొన్నారు.
మరోవైపు ఢిల్లీ బార్డర్ లో ఆందోళన చేస్తున్న రైతులకు కేరళ రైతులు మద్దతు తెలిపారు. ఉద్యమంలో పాల్గొంటున్న రైతుల కోసం ఫ్రీగా 16 టన్నుల పైనాపిల్స్ ను పంపించారు. వళక్కులం నుంచి ట్రక్కులో పైనాపిల్స్ లోడ్ ను కేరళ వ్యవసాయ శాఖ మంత్రి సునీల్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. సోమవారం సాయంత్రానికి ఇవి ఢిల్లీ బార్డర్ కు చేరుకుంటాయని పైనాపిల్ ఫార్మర్స్ అసోసియేషన్ లీడర్ జేమ్స్ తూత్తుమరిల్ చెప్పారు.
176 మొబైల్ టవర్లు ధ్వంసం
ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ లాంటి కార్పొరేట్లకు మేలు చేసేందుకు కేంద్రం అగ్రి చట్టాలను తీసుకొచ్చిందని రైతులు మండిపడుతున్నారు పంజాబ్ లో రైతులు ఇప్పటివరకు రిలయన్స్ జియోకు చెందిన 176 మొబైల్ టవర్లను ధ్వంసం చేశారు.
లాయర్ సూసైడ్
కొత్త అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ కు చెందిన లాయర్ సూసైడ్ చేసుకున్నాడు. టిక్రి బార్డర్ కు దగ్గరలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని ఫజ్లికా జిల్లా జలాలాబాద్ కు చెందిన అమర్జిత్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, రైతుల ఆందోళనకు మద్దతుగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. అయితే సూసైడ్ నోట్ లో తేదీ డిసెంబర్ 18 అని ఉందని, వెరిఫై చేస్తున్నామని హర్యానాలో ఝజ్జర్ జిల్లాకు చెందిన పోలీసులు చెప్పారు. నెలరోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ఇదివరకే సంత్ రామ్ సింగ్, పంజాబ్లోని భటిండాకు చెందిన 22 ఏళ్ల రైతు సూసైడ్ చేసుకున్నారు. సింఘు బార్డర్లో 65 ఏళ్ల ఓ రైతు విషం తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు.
