క్షమాపణ చెప్పే వరకూ గుడిలో బందీలుగా..

క్షమాపణ చెప్పే వరకూ గుడిలో బందీలుగా..
  • బీజేపీ నేతలపై రైతుల ఆగ్రహం
  • హర్యానాలో మాజీ మంత్రి, ఎంపీలకు నిరసన సెగ
  • రోహ్‌‌‌‌‌‌‌‌తక్‌లో గుడిలో నేతల నిర్బంధం.. క్షమాపణ చెప్పాక విడుదల
  • హిసార్ జిల్లాలో ఎంపీ కారుపై ఆందోళనకారుల దాడి

గుర్గావ్/చండీగఢ్: హర్యానాలో బీజేపీ నేతలకు రైతుల నిరసన సెగలు తాకాయి. తమపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు ఉన్న ఓ గుడిని రైతులు చుట్టుముట్టారు. తమకు క్షమాపణ చెప్పాలని, లేదంటే బయటికి వెళ్లనివ్వబోమని.. దాదాపు 8 గంటలపాటు నిర్బంధించారు. పోలీసులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. మాజీ మంత్రి వచ్చి క్షమాపణలు చెప్పిన తర్వాతే వాళ్లను విడిచిపెట్టారు. శుక్రవారం హర్యానాలోని రోహ్‌‌‌‌‌‌‌‌తక్ జిల్లా కిలోయ్ గ్రామంలో జరిగిందీ ఘటన. ఇక హిసార్ జిల్లాలో ధర్మశాల ప్రారంభోత్సవానికి వచ్చిన బీజేపీ ఎంపీ కారును కొందరు ధ్వంసం చేశారు. ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రైతులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది.

గుడిని చుట్టుముట్టి..

కేదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ.. అక్కడ మాట్లాడారు. ఈ కార్యక్రమం లైవ్‌‌‌‌‌‌‌‌ టెలికాస్ట్‌‌‌‌‌‌‌‌ను కిలోయ్‌‌‌‌‌‌‌‌లోని గుడిలో ఏర్పాటు చేయగా.. చూసేందుకు మాజీ మంత్రి మనీశ్ గ్రోవర్, బీజేపీ నేతలు రవీంద్ర రాజు, మన్మోహన్ గోయల్, అజయ్ బన్సల్, సతీశ్ నందల్‌‌‌‌‌‌‌‌ వెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న రైతులు.. మొత్తం గుడిని చుట్టుముట్టారు. మాజీ మంత్రి మనీశ్ గ్రోవర్ రైతులపై అసభ్యకర మాటలు మాట్లాడారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే బయటికి రానివ్వబోమని స్పష్టం చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితి చేయిదాటకుండా చూసుకున్నారు. తర్వాత జిల్లా అధికారులు, పోలీసులు రైతులను శాంతింపజేశారు. గ్రోవర్ క్షమాపణలు చెప్పడంతో వదిలిపెట్టామని రైతులు చెప్పారు. ‘నిరసన ముగిసింది. ఆలయం కాంప్లెక్స్ నుంచి బీజేపీ లీడర్లు బయటికి వచ్చారు” అని డీఎస్పీ సజ్జన్ సింగ్ చెప్పారు. గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్రోవర్ మీడియాతో మాట్లాడారు. తాను రైతులకు క్షమాపణలు చెప్పలేదని అన్నారు. ‘‘నేను గుడిలో ఉన్నప్పుడు ఒకాయన వచ్చారు. రైతులకు అభివాదం చేయమని చెప్పారు. అందుకే చేయి ఊపాను. అంతే. నేను ఎవరికీ క్షమాపణలు చెప్పలేదు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు గుడికి వెళ్తా” అని చెప్పారు.

ఎంపీ కారుపై దాడి

బీజేపీ ఎంపీ రామ్ చందర్ జాంగ్రాకి రైతుల సెగ తాకింది. రోహతక్‌‌‌‌‌‌‌‌లో గురువారం మీడియాతో మాట్లాడిన రామ్ చందర్.. ఆందోళన చేస్తున్న వాళ్లలో రైతులు లేరని, గ్రామాల నుంచి వచ్చిన తాగుబోతులని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం హిసార్ జిల్లాలో ధర్మశాల ప్రారంభోత్సవానికి వచ్చిన జాంగ్రాని రైతులు అడ్డుకున్నారు. నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు ఎంపీ కారు అద్దాలను ధ్వంసంచేశారు. ‘‘కొందరు వ్యక్తులు నా కారుపై కర్రలతో దాడి చేశారు. దీనిపై డీజీపీ, జిల్లా ఎస్పీతో మాట్లాడాను. వాళ్లను కఠినంగా శిక్షించాలని కోరాను. ఇది కచ్చితంగా హత్యాయత్నమే” అని  రామ్ చందర్ జాంగ్రా అన్నారు.