80  రోజులైనా వడ్ల డబ్బులు ఇవ్వట్లేదని.. ఎత్తొండ సొసైటీకి తాళం వేసిన రైతులు

న్యాయం చేస్తామన్న కోటగిరి తహసీల్దార్ హామీతో విరమణ

కోటగిరి, వెలుగు: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని ఎత్తొండ సొసైటీ పరిధిలోని రైతులు తాము అమ్మిన వడ్ల డబ్బులు ఇవ్వాలని శుక్రవారం సొసైటీ ఆఫీసు ముందు నిరసనకు దిగారు. తర్వాత సొసైటీ ఆఫీసుకు తాళం వేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ వడ్లు తీసుకుని ఎనభై రోజులు దాటుతున్నా డబ్బులు ఇవ్వడం లేదని, అడుగుదామని వస్తే సొసైటీలో సెక్రటరీ, చైర్మన్ అందుబాటులో ఉండడం లేదన్నారు.

తమలో చాలా మంది కౌలు రైతులే ఉన్నారని,  వడ్ల డబ్బులు వచ్చాక కౌలు ఇస్తామని పట్టేదారులతో ఒప్పందం చేసుకున్నామని, కానీ ఇక్కడ పరిస్థితి మరోలా ఉందన్నారు. ట్రాక్టర్ల కిరాయి, కోత మిషన్ కిరాయి కట్టాల్సి ఉందని, ఇంట్లో శుభకార్యాలున్నా డబ్బులివ్వడం లేదన్నారు. సొసైటీ పరిధిలో 110 మందికి దాదాపూ రూ.2  కోట్ల వరకు రావాల్సి ఉందన్నారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని, అందుకే సొసైటీకి తాళం వేయాల్సి వచ్చిందన్నారు.

విషయం తెలుసుకున్న కోటగిరి తహసీల్దార్ సునీత అక్కడకు వచ్చి కలెక్టర్​తో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో డబ్బులు వచ్చేలా చూస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.