టమాటాకు రేటు లేక..  పొలాల దగ్గరే పారబోస్తున్న రైతులు

గద్వాల, వెలుగు :  ఒక్కసారిగా టమాటా రేటు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టమాటాలు తెంపే కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు పొలాల దగ్గరే టమాటాలను పారబోస్తున్నారు. మరికొందరు టమాటాలు తెంపకుండా వదిలేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్​కు తీసుకెళ్తే 20 కేజీల బాక్స్​కు రూ.200 ఇస్తున్నారు. ప్రతి బాక్స్ కు రూ.60 ట్రాన్స్ పోర్ట్  ఖర్చు, ఏజెంట్​ కమీషన్​ రూ. 10 పోను ఏమీ మిగలడం లేదని రైతులు వాపోతున్నారు.

టమాటా తెంపే కూలీలు, వ్యవసాయ ఖర్చులు లెక్కేస్తే ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేలు నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు. గద్వాల్  మార్కెట్​లో అమ్మితే మరింత నష్టం వస్తుందని చెబుతున్నారు. లోకల్  మార్కెట్ లో రూ.150కి బాక్స్​ కొంటున్నారని, కమీషన్, హమాలీ కింద బాక్స్​కు రూ.20 తీసుకుంటున్నారని, ఆటో వాళ్లు బాక్స్​కు రూ.30 వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇలా ఖర్చులు పోను ఏమీ మిగలడం లేదని వాపోతున్నారు.