జ్యేష్ఠ పూర్ణిమ.. రైతుల పండుగ.. ఆరోజు ఏం చేయాలంటే ...

హిందూ మతంలో జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన రోజున రైతులు తమ వ్యవసాయ పనులను ప్రారంభించేందుకు భూమి పూజ చేస్తారు.  అందుకే జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పౌర్ణమి లేదా ఏరువాక పూర్ణిమ అంటారు. ఈ సందర్భంగా జ్యేష్ఠ పూర్ణిమ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం... 

హిందూ మతంలో జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మతపరమైన దృక్కోణంలో చూస్తే ఈ రోజు చాలా పవిత్రమైనది. ముఖ్యమైనది. ఎందుకంటే ఈ తేదీన చంద్రుడు పూర్ణ చంద్రుడి రూపంలో కనిపిస్తాడు.మన పూర్వీకుల కాలం నుండి నేటి వరకు భూమిని భూదేవిగా కొలుస్తున్నాం.  వ్యవసాయమే మన మనుగడకు జీవనాధారం.. వ్యవసాయం చేసే రైతులు పొలాల్లో దుక్కి దున్నడాన్ని 'ఏరువాక' అంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని అర్థం. అందుకే చాలామంది రైతులు ఏరువాక పౌర్ణమి రోజు భూమి పూజ చేపి దుక్కి దున్ని పొలం పనులు ప్రారంచభించేవారు.  

జ్యేష్ఠ పూర్ణిమ శుభ సమయం 2024

జ్యేష్ఠ మాసం పౌర్ణమి.. ఏరువాక పౌర్ణమి.. తిథి జూన్ 21, 2024 ఉదయం 6:01 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తేదీ జూన్ 22, 2024 ఉదయం 5:07 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో జూన్ 21వ తేదీ శుక్రవారం రోజున జ్యేష్ఠ పూర్ణిమను జరుపుకుంటారు. ఉపవాసం పూజ చేస్తారు. అలాగే పూర్ణిమ సందర్భంగా జూన్ 22వ తేదీ శనివారం స్నానమాచరించి దానం చేస్తారు.

కాడెద్దులకు పూజలు.. వర్ష రుతువు ఆరంభంలో వచ్చే జ్యేష్ఠ పూర్ణిమ రోజు అన్నదాతలు ఉదయాన్నే నిద్ర లేచి తమ కాడెద్దులను శుభ్రం చేసి వాటికి రంగులు పూసి, గజ్జలు, మెడలో గంటలతో అలంకరించి, వాటిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎద్దులకు భక్షాలు తినిపిస్తారు. అనంతరం పొలానికి వెళ్లి భూదేవికి పూజలు నిర్వహిస్తారు.  అనంతరం ఎద్దులకు రకరకాల రంగులు, కలర్ ఫుల్ బట్టలతో అలంకరించి డప్పులు, మేళతాళాలతో ఊరేగిస్తారు.

రోగాల బారిన పడకుండా..  అలాగే ఎద్దులకు ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు. 

శుభ ఫలితాలు.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నాగలి సారించి పనులు మొదలు పెట్టేందుకు మంచి నక్షత్రం జ్యేష్ఠ అని పండితులు చెబుతున్నారు. ఆ నక్షత్రంతో చంద్రుడు ఉండే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో ఉన్న సమయంలో ఏరువాక పూర్ణిమ శుభఫలితాలు అందుతాయి. అందుకే ఈరోజున తొలిసారి పొలాన్ని దున్నడం ప్రారంభిస్తారు. ఏరువాక పూర్ణిమను సీతాయజ్ణం అని, కన్నడంలో కారణి పబ్బం అని కూడా అంటారు. 

పురాణాల ప్రకారం.. విష్ణు పురాణంలో ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞంగా వివరించారు. సీత అంటే నాగలి అని అర్థం. ‘వప్ప మంగళ దివసం.. బీజవాపన మంగళ దివసం వాహన పుణ్ణాహ మంగళం  కర్షణ పుణ్యహ మంగళం అనే పేర్లతో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లు పండితులు చెబుతున్నారు.