కలగానే సుంకిడి మార్కెట్..పదిహేనేళ్లుగా రైతుల ఎదురుచూపులు

  • స్థల సేకరణ పూర్తైన అడుగు ముందుకు పడలే
  • ఇబ్బందులు పడుతున్న రైతులు 
  • పంట అమ్ముకోవాలంటే ఆదిలాబాద్ మార్కెట్ కు

ఆదిలాబాద్, వెలుగు : జిల్లాలోని తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో ఏర్పాటు చేయాలనుకున్న వ్యవసాయ మార్కెట్ యార్డు కలగానే మిగిలిపోయింది. పదిహేనేళ్లుగా ఆయా మండలాల రైతులకు మార్కెట్ యార్డు నిర్మాణం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గత రెండేళ్ల క్రితం మార్కెట్ యార్డు నిర్మాణానికి మార్కెటింగ్ శాఖ అధికారులు స్థల సేకరణ చేసి ప్రభుత్వానికి నివేదిక సైతం పంపించారు. కానీ అది ప్రతిపాదనలకే పరిమితం కావడంతో రైతులు నిరాశకు లోనవుతున్నారు.

సుంకిడి గ్రామంలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేస్తే తలమడుగు, తాంసి, భీంపూర్ మండలాల రైతులకు సెంటర్​ పాయింట్ గా ఉంటుంది. అందుకే గత ప్రభుత్వాల హయాంలో  లీడర్లు ఇక్కడ వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు తీసుకొచ్చారు. చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ ప్రతిపాదనలకు చివరగా రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఐదు ఎకరాల స్థలం కేటాయించింది. కానీ ఆప్రతిపాదనలు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.  

రైతులకు ప్రయోజనంగా..

ప్రస్తుతం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో తలమడుగు, తాంసి, భీంపూర్, ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్ అర్బన్, మావల మండలాల రైతులు పంటలు విక్రయిస్తారు.   ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పంటలు విక్రయించేందుకు రావాలంటే తలమడుగు, తాంసి, భీంపూర్ మండలాల రైతులకు దూర భారమవుతోంది.  దాదాపు మండలాల్లోని దూర ప్రాంతాల్లోని రైతులు ఆదిలాబాద్ పట్టణానికి పంటలు తీసుకురావాలంటే దాదాపు 30 నుంచి 45 కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉంటుంది.

దాదాపు ఈ మండలాల పరిధిలో 20 వేల మందికి పైగా రైతులు ఉంటారు. వీరంతా ఆదిలాబాద్ కు పత్తి, సోయా, కందులు, శనగలు, జొన్న పంట విక్రయించేందుకు వస్తుంటారు. అయితే  పత్తి వాహనాలు ఎక్కువగా ఉన్నప్పుడు రెండు రోజుల పాటు మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే సుంకిడిలో వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటు అయితే రైతులకు దాదాపు 15 కిలోమీటర్ల దూర భారం తగ్గే అవకాశం ఉంటుంది. 

రూ.2 కోట్లతో ప్రతిపాదనలు..

సుంకిడి గ్రామ శివారులో అప్పట్లోనే 5 ఎకరాలు కేటాయించారు. దీంతో పాటు రూ. 2 కోట్లు బడ్జెట్ అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక   అందజేశారు.   పలుమార్లు స్థానిక లీడర్లు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.  ఒకవేళ సుంకిడి వ్యవసాయ మార్కెట్ ఏర్పడితే ఆదిలాబాద్ మార్కెట్ కు పంట కొనుగోళ్లు, ఆదాయం ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ఆదిలాబాద్‌ మార్కెట్‌ పరిధిలోకి వచ్చే మండలాల్లో  1.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి.

కొత్త మార్కెట్ ఏర్పాటుతో సుంకిడి పరిధిలో దాదాపు 80 వేల ఎకరాల వరకు వస్తుంది. రైతులకు సైతం దూరభారం, రావాణా ఖర్చులు, సమయం ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే గత ప్రతిపాదనలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వ్యవసాయ మార్కెటింగ్ ఏడీ గజానంద్ వెలుగుతో చెప్పారు. 

ఎంతో ఉపయోగపడుతుంది

ఆదిలాబాద్​లో పంట అమ్ముకోవాలంటే మా గ్రామం నుంచి  18 కిలోమీటర్ల వెళ్లాలి. రవాణా ఖర్చులు రూ. 3 వేలు తీసుకుంటారు. అదే సుంకిడి గ్రామంలో ఏర్పాటు చేస్తే 6 కిలోమీటర్ల దూరం దగ్గడమే కాకా,  రవాణా ఖర్చులు  రూ. వెయ్యిలోపే అయిపోతుంది. 

- గణపతి, రైతు రుయ్యాడి గ్రామం